* తరచూ ఢిల్లీ వెళ్లి నిధులు రాబట్టిన సీఎం చంద్రబాబు
* నిర్మలమ్మ బడ్జెట్ భేష్
* షీ మార్ట్స్ ఏర్పాటుతో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పన
* కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం
* చేనేత, జౌళి రంగానికి ఎంతో మేలు
* రాయలసీమలోనూ ‘బుల్లెట్’ పరుగులు
* జిల్లాకో బాలికా హాస్టల్ ఏర్పాటు నిర్ణయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సవిత హర్షం
పెనుకొండ/శ్రీసత్యసాయి : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయింపు క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుదేనని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యంపై తరుచూ ఢిల్లీ వెళ్లి పీఎం నరేంద్రమోడిని, ఇతర కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు రాబట్టారన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికీ అనుకూలమైనదని కొనియాడారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఆదాయ పన్ను శాతం స్లాబ్ రేటు పెంపుదల ఎంతో మేలు కలుగుతోందన్నారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదో పర్యాయం బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.
బడ్జెట్ లో బాలికా విద్యకు, వ్యవసాయానికి, చేనేత, జౌళి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతి జిల్లాలోనూ బాలికా హాస్టల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ఈ హాస్టల్ ఏర్పాటుతో బాలికా విద్యాభివృద్ధికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. రూ.12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేల వరకూ పెంపుదలతో ఉద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.
సామాన్య ఉద్యోగికి సైతం రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకూ లబ్ధిపొందుతుందన్నారు. గ్రామీణ మహిళల సాధికారతతో పాటు స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ కలిగేలా మండల స్థాయిలో షీ మార్ట్స్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. షీ మార్ట్స్ వల్ల గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పనతో ఆర్థిక భరోసా కలుగుతుందని మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.
నిధుల రాక క్రెడిట్ సీఎం చంద్రబాబుదే…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. బడ్జెట్ కు ముందు ఎన్నో పర్యాయాలు ఢిల్లీ వెళ్లి పీఎం నరేంద్రమోడిని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను, ఇతర కేంద్ర మంత్రులను కలిశారన్నారు. ఆయన కృషి ఫలితమే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ. 500 కోట్లు, రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.రూ.350 కోట్లు, తాగు, మురుగునీటి నిర్వహణకు రూ.800 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320 కోట్లు, రాజధాని అమరావతికి రూ.1,128.91 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడం వెనుక సీఎం చంద్రబాబు ఎంతో కృషి ఉందని, ఈ క్రెడిట్ అంతా ఆయనదేనని మంత్రి సవిత తెలిపారు.
చేనేత, జౌళి రంగానికి ఎంతో మేలు
బడ్జెట్ లో చేనేత, జౌళి రంగానికి పెద్దపీట వేయడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. దేశంలో కొత్తగా మెగా టెక్స్టైల్స్ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారన్నారు.మహాత్మాగాంధీ గ్రామ్ స్వరాజ్ పథకంలో భాగంగా ఖాదీ, హ్యాండ్లూమ్ రంగాలను బలోపేతం చేస్తామన్నారన్నారు.
దేశవ్యాప్తంగా మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో ధర్మవరం, పిఠాపురం, మంగళగిరి పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందనున్నాయన్నారు. వాటితో రాష్ట్రంలో మరిన్ని టెక్స్ టైల్స్ పార్కులు, మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు.
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. చేనేతలకు 50 ఏళ్లకే రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. రాబోయే ఏప్రిల్ ఫస్ట్ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేయనున్నామన్నారు.
రాయలసీమలో ‘బుల్లెట్’ పరుగులు
రాయలసీమలో బుల్లెట్ ట్రైన్లు పరుగులు తీయనున్నాయని మంత్రి సవిత వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా ఏడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేయనుందని, వాటిలో మూడు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లనున్నాయని తెలిపారు. రాయలసీమలో బుల్లెట్ ట్రైన్లు ఆగేలా దుద్దేబండ, హిందూపురంలో స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నారు. బుల్లెట్ ట్రైన్ల రాకపోకలతో రాయలసీమకు ఎంతో మేలు కలుగుతుందని, యువతకు, ఉద్యోగులకు, వ్యాపారులకు మరింత లబ్ధి కలుగనుందని తెలిపారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలో రూ.270 కోట్లతో సోమందేపల్లి-తూముకుంట నుంచి నాలుగు రహదారుల లైన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందన్నారు. వికసిత్ భారత్ -2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని మంత్రి సవిత తెలిపారు.