– స్కూల్ స్థాయి నుంచే క్రీడాకారులను తయారుచేయాలనేది మంత్రి నారా లోకేష్ సంకల్పం
– పెనుమాకలో 68వ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ “త్రో బాల్” అండర్-17 బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు
– స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన అనిమిని రవినాయుడు, తమ్మిశెట్టి జానకీదేవి
తాడేపల్లి రూరల్: పెనుమాక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 68వ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ “త్రో బాల్” అండర్-17 బాలబాలికల ఛాంపియన్షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిలుగా హాజరైన శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి జ్యోతిప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో ఎంపిక అయిన క్రీడాకారులు నేషనల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం అని అన్నారు. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ స్పోర్ట్స్ పాలసీని రూపొందించినట్లు తెలిపారు.
క్రీడాకారుల ప్రోత్సాహకాలను భారీగా పెంచిన ఘనత ఏపీ ప్రభుత్వానిది అని చెప్పారు. ఏషియన్, ఖేలో, నేషనల్స్ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు రూ. 3లక్షలు ప్రోత్సాహకం అందజేయనున్నట్లు చెప్పారు. నేషనల్స్ లో రాణించిన వారికి యూనిఫాం ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ క్రీడావికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.స్కూల్ స్థాయి నుంచి క్రీడాకారులను తయారుచేయాలనేది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పం అన్నారు.
ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశయం అని దానికి అనుగుణంగా క్రీడాకారులు కూడా క్రీడల్లో రాణించి ప్రపంచవ్యాప్తంగా దేశ కీర్తిప్రతిష్టతలను ఇనుమడింపజేయాలన్నారు. 2014-19లో హయాంలో క్రీడా వికాస కేంద్రాలు, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాలు, మల్టీపర్పస్ స్టేడియాలతో క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. తర్వాత కాలంలో 80-90 శాతం మేర పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను సైతం మిగిలిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురాకుండా వైసీపీ నాయకులు నిర్లక్ష్యం చేశారన్నారు.
ఐదేళ్లల్లో రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. దాదాపు రూ. 119 కోట్లతో ఆడుదాం.. ఆంధ్రా అంటూ క్రీడలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. నారా లోకేష్ మంత్రి అయిన తర్వాతనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జి శాంత కుమారి,ఎస్.ఎం.సి చైర్మన్ తెనాలి కోటేశ్వరరావు, తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు, తాడేపల్లి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, గుంటూరు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.