Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి తీరుతో తనను ఎన్నుకున్న పులివెందులకూ చెడ్డపేరు

-ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడు…ఒక్క చాన్స్ చివరి చాన్స్ అవుతుంది
-నియోజకవర్గ ఇంచార్జ్ ల ముఖాముఖీ భేటీలో టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు
-నేటితో 126 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో ముగిసిన సమీక్షలు

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పాలనా తీరు, విద్వేష రాజకీయాల కారణంగా తనను ఎన్నుకున్న పులివెందులకూ చెడ్డపేరు తెస్తున్నారని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి తన రివర్స్ పాలనతో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తెచ్చుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వివేకా హత్యపై సమాధానం చెప్పలేక, విద్వేష రాజకీయాల కారణంగా ముఖ్యమంత్రి నైతికంగా పతనం అయ్యాడని తెలిపారు. బాబాయ్ హత్య కేసులో స్వయంగా ముఖ్యమంత్రి దోషులను కాపాడడం స్థానిక ప్రజలకు కూడా మింగుడు పడడంలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో రివ్యూలలో నేతలతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక్క చాన్స్ అంటూ వచ్చిన జగన్ కు అదే చివరి చాన్స్ అవ్వనుందని…ప్రజల్లో ఎక్కడ చూసినా ఈ చర్చే కనిపిస్తోందని నేతలతో అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్లో కూడా వ్యతిరేకత తెచ్చుకున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి నిలిచిపోతారాని వివరించారు. అన్ని వర్గాల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్న పరిస్థితిని రాజకీయంగా తెలుగు దేశం అనుకూలంగా మార్చుకోవాలని నేతలకు సూచించారు.

ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని సూచించారు. ఇప్పటి వరకు 126 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు రివ్యూ లు చేశారు. నిన్న, ఈ రోజు కలిపి 6 నియోజకవర్గాలకు చెందిన ఇంఛార్జ్ లతో సమీక్ష చేశారు. ఈ రెండు రోజుల్లో పులివెందుల, వెంకటగిరి, నూజివీడు, తుని, పాడేరు, పాలకొండ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు.

నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు, మెంబర్ షిప్, పార్టీ కార్యక్రమాల నిర్వహణపైనా నేతలతో అధినేత సమీక్షలు జరిపారు. గ్రామస్థాయి వరకు గ్రూపులు అనే అంశమే ఉండకూడదని…ఇంచార్జ్ లు అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. ఇంచార్జ్ లతో రివ్యూల అనంతరం వారి పనితీరులో మార్పు వచ్చిందా లేదా అనే అంశంపైనా సమాచారం తెప్పించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు.

పార్టీ అధిష్టానం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా నేతలు పనితీరు మెరుగుపరుచుకోకపోతే దానికి అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని నేతలకు చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. సమీక్షల అనంతరం కూడా కొందరు నేతలు యాక్టివ్ అవ్వలేదని తన దృష్టికి వచ్చిందని, అటువంటి నేతల విషయంలో త్వరలో నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE