– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, నవంబర్ 2: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం టెలిఫోన్ నగర్ కు చెందిన క్రిస్టియన్ మైనార్టీ నేతలు రాజ్యలక్ష్మి, లాజర్, శ్రీరాములు, రాంబాబు, ప్రదీప్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలిఫోన్ నగర్లో చర్చి నిర్మాణానికి క్రిస్టియన్ మైనార్టీ కార్పోరేషన్ ద్వారా రూ. 5 లక్షల నిధులను మంత్రి కొడాలి నాని మంజూరు చేయించడం పట్ల అభినందనలు తెలిపారు. సీఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి తమవంతు సహకారాన్ని అందజేస్తామని వారు చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమంలో భాగంగా చర్చిల నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తోందని తెలిపారు. సీఎం జగన్మోహనరెడ్డికి కుల, మతాలు లేవని, రాష్ట్రంలోని ప్రజలంతా సమానమేనని చెప్పారు. అన్ని మతాల విశ్వాసాలను సీఎం జగన్మోహనరెడ్డి గౌరవిస్తారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొండపల్లి కుమార్రెడ్డి, మండల ప్రముఖుడు మలిరెడ్డి రాందాసు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.