– వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన సీఎం వైయస్.జగన్
– రూ. 515.90 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం వైయస్.జగన్
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే…:
ప్రొద్దుటూరుకి ఈరోజు రావడం, మీ అందరి ప్రేమానురాగాల మధ్య ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా శంకుస్ధాపన చేయడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. కారణమేమిటంటే నాన్న చనిపోయినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా కడప జిల్లా నన్ను గుండెల్లోనే పెట్టుకుని చూసుకుంది. ప్రతి ఇంట్లోనూ ఒక అన్న, తమ్ముడు, కొడుకుగా ఆశీర్వదించారు. ఈ రోజు మీ బిడ్డ ఈ స్ధానంలో ఉన్నాడన్నా… మీ బిడ్డ ఈ రోజు ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాడన్నా కూడా ఇదంతా దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులే.
30 నెలల్లో ప్రొద్దుటూరుకు రూ.326 కోట్లు..
ఈ రోజు ప్రొద్దుటూరు నగరానికి మంచి చేస్తూ… మనందరి ప్రభుత్వం ఏం చేయబోతుంది అని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కేవలం ౩౦ నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో కేవలం డీబీటీ పద్ధతిలో అంటే నేరుగా బటన్ నొక్కిన వెంటనే ఎటువంటి రాజకీయ ప్రమేయం, వివక్ష లేకుండా అక్షరాలా రూ.326 కోట్లు బదిలీ చేయగలిగాం.
అప్పట్లో నాకు బాగా గుర్తుంది. నగరం పెద్దదవుతుంది. ఇళ్లు లేని వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇంటి స్ధలాల కోసం ఇక్కట్లు పడుతున్న పరిస్ధితులు. దాదాపుగా 500 ఎకరాలు కావాల్సిన పరిస్థితి. దాదాపుగా 22వేల పైచిలుకుమందికి ఇంటి స్ధలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇంటి స్ధలం కావాలంటే
ప్రభుత్వం వద్ద ఎక్కడా కూడా ఇంత స్ధలం లేని పరిస్థితులలో… ఇక్కడ స్ధలం కావాలంటే ప్రైవేటు స్ధలం నుంచి సేకరించాలని చెప్పినప్పుడు అక్షరాలా రూ.200 కోట్లు దీనికోసం ఖర్చవుతుందని చెప్పినప్పుడు కూడా.. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా చిరునవ్వుతో మీ బిడ్డ మంజూరు చేశాడు.
అక్షరాలా 22,212 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగాం. వీరిలో మొదట దఫా గృహనిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు 10,820 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కూడా మంజూరై మరో పది రోజుల్లో నిర్మాణం కూడా మొదలవుతుంది. రకరకాల కోర్టు కేసుల మధ్య అన్ని కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇక్కడా, పులివెందులలోనూ ఇళ్ల నిర్మాణకార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నాం. రాష్ట్రంలో అందరికీ కూడా సంక్షేమపథకాలు, సంక్షేమఫలాలు అన్నింటిని అందరితో ఇవ్వడమే కాకుండా మీ అన్నగా మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ రోజు అనేక పథకాలకు ఈ వేదిక మీద నుంచే శ్రీకారం చుడుతున్నాం.
రూ.119 కోట్లు- తాగునీటి సరఫరా కోసం…
తాగునీటి సరఫరా కోసం 52 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా పైపులన్నీ కూడా పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్న పరిస్థితులు. ఒకవైపు మైలవరం నుంచి నీళ్లు తీసుకుని రావడమే కాకుండా మరోవైపు ఆ నీళ్లువచ్చిన తర్వాత పైపులైన్ల ద్వారా ప్రొద్దుటూరు నగరంలోని ప్రతి కుటుంబానికి కూడా నీళ్లు సరఫరా చేయాలంటే.. ఆ పైపులైన్లు అన్నీ శిధిలావస్ధకు చేరాయని చెప్పి వాటిని మరలా రూ.119 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పైపులైన్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. 171 కిలోమీటర్ల పొడవైన ఈ పైపులైన్ ద్వారా ప్రతి వ్యక్తికి గరిష్టంగా రోజుకి 135 లీటర్లు నీటిసరఫరా చేయవచ్చు.
అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్ధలో కూడా ప్రస్తుతమున్న 5 ఛానెళ్లను కూడా ఆధునీకరణచేస్తున్నాం. వీటికోసం మరో రూ.163 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నాం. 8.87 కిలోమీటర్ల పొడవైపు సిమెంట్ కాంక్రీట్ డ్రైన్లు, 24 ఎంఎల్‌డీ సామర్ధ్యంతో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం కూడా నిర్మిస్తున్నాం. సీవరేజ్ ట్రీట్మెంట్ ద్వారా ఏకంగా థర్డ్ స్టేజ్ ట్రీట్మెంట్ కూడా చేసి నీళ్లు వృధా కాకుండా ఆ నీళ్లను మరలా ఉపయోగించుకునే విధంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్రొద్దుటూరుకు మంజూరు చేస్తూ.. ఆ పనులకు శ్రీకారం చుడుతున్నాం.
రూ.53 కోట్లతో వంతెన నిర్మాణం
ప్రొద్దుటూరు నుంచి రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాలనీ వీటినన్నింటిని కూడా వేగంగా చేరుకోవడం కోసం పెన్నానదిపై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం మరో రూ.53 కోట్లతో పనులుకు శంకుస్ధాపన చేస్తున్నాం. దీని వల్ల పదిగ్రామాల వారికి రాకపోకలకు ఉపయోగం ఉంటుంది.
ప్రొద్దుటూరు బస్‌స్టేషన్ అభివృద్ధి చేయాలని చెప్పి అడిగినప్పుడు.. ఆ పనులు కూడా మంజూరు చేస్తూ… ఇవాళ రూ. 4.50 కోట్లు వ్యయంతో కొత్తగా తొమ్మది ప్లాట్‌ఫాంలు, భవన నిర్మాణం, ప్రయాణికులు రాత్రివేళ బసచేసేందుకు వీలుగా డార్మెటరీలు, మంచి బాత్రూమ్‌లు, బస్టాండ్ ప్రాంగణంలో లైట్లు, డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులు, పక్కాగా డ్రైనేజీ వ్యవస్ధ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేస్తున్నాం.
మార్కెట్ మరింత అభివృద్ధి
ఇంతకుముందున్న కూరగాయల మార్కెట్ ప్రొద్దుటూరు అవసరాలకు సరిపడనంతగా లేనందున కొత్తగా కూరగాలయ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు.. రూ.50.90 కోట్లతో 2.34 ఎకరాల సువిశాల స్ధలంలో 40 రూములతో కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడుతున్నాం. కనీసం 252 మంది చిన్నతరహా వ్యాపారులు, 30 మంది టోకు వ్యాపారులు, మరో 30 కిరాణా షాపులతో పాటు 35 మంది చిరువ్యాపారుల కార్యక్రమాలకు కూడా అనువుగా ఈ మార్కెట్‌ను నిర్మిస్తున్నాం. డ్రైనేజీ వ్యవస్ధను కూడా మెరుగుపరుస్తున్నాం. కొత్త కూరగాయల మార్కెట్ వల్ల అన్ని రకాలుగా ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరుగుతుంది.
ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు నూతన కళ
ప్రస్తుతమున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల రూపురేఖలు మార్చడానికి ఇవాళ రూ.24 కోట్లు మంజూరు చేశాం. మంచి ప్రహారీ, మంచి టాయ్‌లెట్లు, మంచి లైబ్రరీ, లేబులు, అదనంగా తరగతి గదులు సెమినాల్ హాళ్లు, డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. యోగివేమన యూనివర్సిటీకి చెందిన వైయస్సార్ ఇంజనీరింగ్ కళాశాల.. మన కళ్లెదుటే చూస్తున్నాం. గతంలో ఎవరూ దీన్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు. పేరుకేమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల.కానీ అద్దె భవనాలలో ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా మారుస్తూ… రూ.66 కోట్ల వ్యయంతో ఇంజనీరింగ్ కాలేజీని పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం. మంచి తరగతిగదులు, సెంట్రల్ లైబ్రరీ, టాయ్‌లెట్లు, గ్రీన్‌బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్, మంటి ఫర్నీచర్, లేబులు ఇవన్నీ ఇక్కడ రాబోతున్నాయి. ప్రొద్దుటూరు నగరంలో మరికొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ… రూ.15 కోట్లతో చేపడుతున్నాం.
సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణం, కల్వర్టులు, ఆర్వో ప్లాంట్లు షెడ్లు, పార్కుల అభివృద్ధి, వాణిజ్య సముదాయ నిర్మాణం, మెరుగైన నీటిసరఫరా వంటి పనులతో పాటు… ప్రొద్దుటూరు మున్సిపాల్టీకి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం పెట్రోల్ బంకు మంజూరు చేయమని అడిగితే అది కూడా మంజూరు చేశాం. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి పనులు కోసం రూ.20.50 కోట్లు మంజూరు చేశాం. మొత్తంగా రూ.515 కోట్లతో ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశాం.
కాసేపటి క్రితం ప్రసాద్( ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి) మాట్లాడుతూ… ఉర్ధూ డిగ్రీ కాలేజీ కోసం, ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కోసం అడిగాడు. ఈ రెండూ కూడా మంజూరు చేస్తున్నాను.ఇవన్నీ కూడా మనస్సు పెట్టి చేస్తున్నాం. మీ బిడ్డను ఇక్కడున్న సమస్యలు, పరిస్థితులు తెలిసిన వ్యక్తిని. ఈ జిల్లాలో ఏం జరిగినా కూడా… అన్నిరకాలుగా ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాను.
మీలో ఒకడిగా తోడుంటాను
గత నెలలో అన్నమయ్యసాగర్, ఫించా రిజర్వాయర్లు తెగిపోయినందువలన ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. ఎంతో బాధనిపించింది. ఈ జిల్లా వాడిగా, మీ బిడ్డగా బరువెక్కిన గుండెతో ఒక్కమాట మాత్రం చెబుతున్నాను. చనిపోయిన కుటుంబాలకు ఆ మనుషులనైతే నేను తెప్పించలేను కానీ, ఆ కుటుంబాలకు మాత్రం .. ఆ కుటుంబసభ్యులలో ఒకరిగా అన్ని రకాలుగా తోడుగా ఉంటాను అని భరోసా ఇస్తున్నాను.
మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఇన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతున్నందుకు.. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సదా కృతజ్ఞతుడిగా ఉంటాను. మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని.. .మీ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.