Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని హైదరాబాద్ కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సీనియర్ ప్రొఫెషనల్ శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ రంగంలో ఐటీ ప్రొఫెషనల్ గా 30 ఏళ్ళ పాటు పనిచేశానని చెప్పారు. అమెరికాలో కూడా వివిధ హెూదాల్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. పలు ఇంటర్నేషనల్ మ్యాగ్ జైన్స్ లో ఐటీ రంగంలో క్వాలిటీని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అనేక కథనాలు రాయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం అభివృద్ధికి విశేష కృషి జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో మాత్రమే పనిచేశానని, ప్రభుత్వ రంగంలోనూ పనిచేయాలనే ఆసక్తితో ఉన్నానని తెలిపారు. తన అర్హతలను పరిశీలించి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఐటీ ప్రొఫెషనల్ గా 30 ఏళ్ళ పాటు పనిచేసిన శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐటీ రంగం అభివృద్ధి కోసం పనిచేయడానికి ఆసక్తి చూపడం అభినందనీయమని చెప్పారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. సంబంధిత మంత్రిని కలవాలని సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు సమీపంలోని మూడు ప్రాంతాల్లో మూడు ఐటీ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయడంపై సీఎం జగన్మోహనరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. అన్ని సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలతో ఈ కాన్సెప్ట్ సిటీల అభివృద్ధి జరుగుతుందన్నారు. జాతీయ రహదారులు, విమానాశ్రయాలు కూడా అందుబాటులోనే ఉంటాయన్నారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులను చూసి ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపే ఐటీ కంపెనీలకు వేగంగా అనుమతులు వస్తాయన్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం వల్ల రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఇంటర్నెట్ నెట్ వర్క్ బలంగా లేకపోతే అనుకున్న లక్ష్యాలను చలేమనే ఆలోచనలో సీఎం జగన్మోహనరెడ్డి ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలన్నీ ఇంటర్నెట్ తో అనుసంధానం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు కొల్లి విజయ్, చుండూరి శేఖర్, మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE