తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలన్నీ నీటిలో మునిగాయి. దీంతో అన్నదాతలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.అకాల వర్షం కారణంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వందలాది హెక్టార్లల్లో పలు పంటలకు నష్టం జరిగింది.
ఈ విషయంపై సోమవారం జరిగిన తెలంగాణ కేబినేట్ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే,ఈ సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న రైతుల పంటలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన (CM KCR Warangal tour) రద్దయింది. సీఎం కేసీఆర్ ఈ రోజు నిర్వహించాలనుకున్న వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
అయితే.. ఈ పర్యటనను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. నష్టపోయిన రైతులను స్వయంగా కలవడంతోపాటు.. పంట పోలాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికార బృందం వడగండ్లతో వానతో దెబ్బతిన్న పంటలను ఫీల్డ్ విజిట్ చేసి నివేదిక సిద్ధం చేసి.. ప్రభుత్వానికి అందించనుంది.
అయితే.. వడగండ్ల వర్షంతో నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలోని 18 మండలాల్లోని పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లింది. మిరప, మొక్కజొన్న, బొప్పాయి, కూరగాయలు, కంది పంటలకు 100% నష్టం వాటిల్లినట్లు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతాల్లో 960కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.