Suryaa.co.in

Andhra Pradesh

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా నిర్లక్ష్యం వీడని జగన్మోహన్ రెడ్డి

ప్రజల ప్రాణాలకంటే కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం
-రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

కరోనా కట్టడి కంటే కక్షసాధింపు చర్యలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యగా మారిపోవడం బాధాకరం. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగున్నా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదు. నిర్లక్ష్యంతో కరోనా మొదటి, రెండో దశల్లో భారీ ప్రాణనష్టానికి కారణమైన ముఖ్యమంత్రి గత అనుభవాల నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోకపోవడం సిగ్గుచేటు. కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడంలోనే తెలిసింది జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రాణాలంటే ఎంత చులకనో. ముఖ్యమంత్రికి ప్రజాధనంతో సొంత పత్రిక సాక్షిలో ప్రకటనలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను కాపాడటంలో లేకుండా పోయింది.

రాష్ట్ర బడ్జెట్ లో , ప్రభుత్వ నిధుల మంజూరులో కమీషన్లు వచ్చే పథకాలకే కేటాయింపులు ఘనంగా చేసుకుని కరోనా నివారణ, వైద్య రంగానికి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేడంలేదు. కరోనా నివారణకు నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయకుండా కేవలం ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోంది. పాలనా సమయం మొత్తం రాజకీయ కుట్రలకే కేటాయిస్తారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో ఇతర రాష్ట్రాలు ఎలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయో చూసైనా వైసీపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. దేశమంతా టీకా ప్రక్రియ వేగంగా జరుగుతుంటే మన రాష్ట్రమేమో వ్యాక్సినేషన్ లో వెనకబడి ఉంది. రోజువారీ కరోనా కేసుల్లో 5వ స్థానంలో వ్యాక్సినేషన్ లో 10వ స్థానంలో ఏపీ ఉందంటే అందుకు ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం.

ఒక్కసారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగితే పరిస్థితి ఏంటి? నేటికీ ప్రభుత్వాసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. వైద్యరంగంపై ముఖ్యమంత్రి నిర్వహించే మొక్కబడి సమీక్షల్లో కనిపించడం మినహా ఆరోగ్య మంత్రి జాడే ఉండటం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి , వైద్యయంత్రాంగం మొద్దు నిద్ర వీడాలి. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పించాలి.

LEAVE A RESPONSE