– అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలి
– ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగం
– త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక పాలసీ
– అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుడుతూ.. పది నెలల్లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం.
మేం బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల తల్లిదండ్రులకళ్లల్లో ఆనందం చూసాం. అది నాకు అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భం. ఇక్కడ ఎంపికైన AMVI లకు ఈ వేదిక గా సూచన చేస్తున్నా. మీ గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడండి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా స్ఫూర్తి నింపండి. చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం అని వారికి విశ్వాసం కల్పించండి. ప్రభుత్వంపై నమ్మకం కలిగించండి.
దీపావళి పండుగ రోజున డ్రగ్స్ తీసుకుని గృహప్రవేశం అని కొందరు బుకాయించే ప్రయత్నం చేశారు. లీడర్ అంటే లీడ్ చేసేవాడు. అందరికీ రోల్ మోడల్ గా నిలిచేలా ఉండాలి.. కానీ పండగ వస్తే డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారు కాదు. అలాంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలని యువతను కోరుతున్నా.
ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్ గా తీసుకోవాలో.. డ్రగ్స్, సారా బుడ్లతో దావత్ చేసుకునే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలో యువత ఆలోచోంచాలి. సరిహద్దుల్లో గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలోకి రాకుండా ఉక్కు పాదం మోపాలి.
ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగం. కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే రవాణా శాఖ సంపూర్ణ సహకారం ఉండాలి.. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక పాలసీ తీసుకొస్తాం.