Suryaa.co.in

Andhra Pradesh

తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతు కన్నీళ్లు ముఖ్యమంత్రే తుడవాలి

• నిబంధనలు పక్కనపెట్టి మానవతాధృక్పథంతో ముఖ్యమంత్రి రైతుల్ని ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు
• రైతులకు జరిగిన నష్టానికి.. రాష్ట్రం తుఫాన్ బారిన పడి ప్రజలు కష్టాలపాలు కావడానికి కారణం జగన్ రెడ్డి..అతని ప్రభుత్వ నిద్రావస్థే
• ల్యాండ్..శాండ్.. వైన్.. మైన్ సహా..ఇతర వనరుల దోపిడీకోసం చేస్తున్న ముందస్తు పథకరచనలో సగంకూడా మిగ్ జాం తుఫాన్ బారి నుంచి ప్రజల్ని కాపాడటంలో జగన్ రెడ్డి చేయలేకపోయాడు
• తాడేపల్లిలో కూర్చొని తాను అధికారులకు చెప్పింది ఎంతవరకు అమలైందో తెలియాలంటే జగన్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి
• తుఫాన్ వల్ల దెబ్బతిన్న హెక్టార్ వరిపైరుకు ప్రభుత్వం రూ.30వేల ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి. ఆక్వా సాగుకి రూ.50 వేలు ఇవ్వాలి
• హెక్టార్ అరటికి రూ.40వేలు.. హెక్టార్ చెరకు పైరుకి రూ.30వేలు.. హెక్టార్ పత్తికి రూ.25వేలు.. మిర్చికి రూ.50వేల పరిహారం అందించాలి
• మొక్కజొన్న, జొన్న, ఇతర అపరాలకు హెక్టారుకు రూ.15వేలు .. జీడిపంటకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం
• మిగ్ జాం తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ( ఒక్కో కుటుంబానికి) రూ.10లక్షల పరిహారం అందించాలి
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

మిగ్ జాం తుఫాన్ మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని.. ప్రధానంగా రైతాంగానికి చెప్పలేనంత నష్టం వాటిల్లిందని.. కోతకు వచ్చిన వరిపైరు నీళ్లపాలై అన్నదాతకు గుండెకోత మిగిల్చిందని.. తిరిగి కోయడానికి వీల్లేని విధంగా వరిపై రు పనికిరాకుండా పోయిందని… ఇప్పటికే కోసి వోదెలేసిన వరి మొత్తం నీళ్లల్లో మగ్గిపోయిందని టీడీపీనేత, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీని వాస రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం ఒక్క 10శాతం వరిపైరు మాత్రమే రైతుల చేతికి అందింది. మిగిలిందంతా నీళ్లపాలయిందనే చెప్పాలి. వరితో పాటు మిర్చి, పత్తి, పొగాకు పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. పొగాకు పైరు నీటి తో తడవడం వల్ల ఆకులో నాణ్యత తగ్గి.. మొత్తం సూరగా మారే పరిస్థితి. మిర్చి పైరు ఎక్కువగా తెగుళ్లబారిన పడే ప్రమాదముంది. వేరుశనగ పైరు మొత్తం మట్టి.. ఇసుకతో కప్పబడి నామరూపాల్లేకుండా పోయింది. మామిడి.. అరటి .. బొప్పాయి వంటి ఉద్యానపంటలు కూడా కూడా బాగా దెబ్బతిన్నాయి. తూర్పు.. పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఇంతనష్టం జరగడానికి కారణం ముమ్మాటికీ ముఖ్య మంత్రి జగన్ రెడ్డే.

మిగ్ జాం రాష్ట్రాన్ని కబళిస్తోందని తెలిసినా.. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు
రాబోతున్న ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడంలో… సకాలంలో స్పందించి రైతాంగాన్ని.. ప్రజల్ని ఆదుకోవడంలో జగన్ రెడ్డి, అతని అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యాయనే చెప్పాలి. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో వచ్చిన తుఫాన్లు..ఇతర విపత్తులు.. వాటివల్ల జరిగిన నష్టం కళ్లముందు కనిపిస్తున్నా.. జగన్ రెడ్డి మిగ్ జాం తుఫాన్ ను ఎదుర్కోవడానికి ఎలాంటి ముందుస్తు చర్యలు చేపట్టలేదు. సమాచార వ్యవస్థల ద్వారా రాష్ట్రాన్ని మిగ్ జాం తుఫాన్ కబళిస్తోందని ముందే తెలిసినా.. రైతుల్ని ఆదుకునేందుకు వైసీపీప్రభుత్వంలోని సర్వర్లు, ఆర్బీకే (రైతుభరోసా కేంద్రాలు) ఏవీ సకాలంలో పనిచేయలేదు.

మిగ్ జాం రాష్ట్రాన్ని ముంచెత్తేవరకు ముఖ్యమంత్రి సహా మొత్తం పాలనా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించింది. ధాన్యం రాశుల్ని కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు కూడా ఈ ముఖ్యమంత్రి అందించలేకపోయాడు. రైతాంగం పట్ల.. వ్యవసాయం పట్ల జగన్ రెడ్డికి ఉన్న బాధ్యతారాహిత్యానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? నదీగర్భాలు తొలిచి మరీ ఇసుక దోపిడీ చేస్తూ.. బయటి రాష్ట్రాల నుంచి టెండర్లు పిలిచి మరీ ముందుచూపుతో ప్రజలసొమ్ము దోచుకుంటున్న ముఖ్యమంత్రికి.. వారం ముందు తుఫాన్ రాకను పసిగట్టి రైతుల్ని ఆదుకోవాలని తెలియకపోవడం నిజంగా బాధాకరం. ల్యాండ్..శాండ్.. వైన్.. మైన్ సహా..ఇతర వనరుల దోపిడీకోసం చేస్తున్న ముందస్తు పథకరచనలో సగంకూడా మిగ్ జాం తుఫాన్ బారి నుంచి ప్రజల్ని కాపాడటంలో జగన్ రెడ్డి చేయలేకపోయాడు.

తుఫాన్ వల్ల ప్రజలు సర్వంకోల్పోయినా వారిని ఆదుకోవడంలోనూ అదే మొద్దునిద్ర ముఖ్యమంత్రి అధికారులకు చెప్పింది ఎంతవరకు అమలైందో తానే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి
తుఫాన్ రాకముందు నిద్రావస్థలో ఉన్న జగన్ రెడ్డి.. జరగాల్సిన నష్టం జరిగి ప్రజలు తమ ఇళ్లు.. వాకిళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యాక కూడా వారికి సాయం చేయడంలో కూడా విఫలమయ్యాడు. పునరావాస కేంద్రాల్లోని వారికి తాగటానికి నీరు.. తినడానికి తిండి కూడా ఈ ప్రభుత్వం సరిగా అందించడం లేదు. తుఫాన్ బాధితుల వద్దకు వెళ్లి… ఒక ఆహారపు పొట్లమిచ్చి దాన్నే ఇద్దరు తినాలంటు న్నారు. నిలిచిన విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు రోజుల తరబడి ఎదురుచూడా ల్సిన దుస్థితి. రైతుల కన్నీళ్లు తుడవడం మానేసి ఎప్పటిలానే ఉత్తుత్తి మాటలతో, ఉపన్యాసాలతో సరిపెట్టాడు. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి జగన్ రెడ్డి ఏం చేయబోతున్నాడో చెప్పాలి.

తాను అధికారులకు చెప్పిన మాటలు ఆచరణలో ఎంతవరకు సాధ్యమయ్యాయో ఆయనే స్వయంగా పరిశీలించాలి. తుఫాన్ ప్రభావంతో ఇళ్లు.. పొలాలు కోల్పోయి..ఇతరత్రా నష్టపోయిన వారికి తన ప్రభుత్వంలో అందుతున్న సాయంపై జగన్ రెడ్డి తక్షణమే పునరాలోచించాలి. జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఏరియల్ సర్వే చేసి. జరిగిన నష్టంపై వీలైనంత త్వరగా ప్రాథమిక అంచనాకు రావాలి. జగన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తేనే మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టమేంటో ఆయనకు తెలుస్తుంది. కళ్లముందే కష్టపడి పండించిన పంట నీళ్లపాలై కుమిలిపోతున్న రైతుకు కావాల్సింది కేజీ ఉల్లిగడ్డలు .. కేజీ ఉర్లగడ్డలు.. రూ.1000, రూ.2,000ల ఆర్థికసాయం కాదని ముఖ్యమం త్రికి అర్థమవుతుంది.

ప్రజలు కోరుకునేది ఏమిటో తెలుసుకోవాలంటే తక్షణమే జగన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నీటమునిగిన పంటపొలాలు పరిశీలించాలి. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టైనా సరే… రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్య మంత్రిదే. రాష్ట్రంలో రూ.7వేలకోట్ల పంటనష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. రూ.10లక్షలకోట్ల అప్పుల చేసి.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన జగన్ రెడ్డికి రూ.7వేలకోట్ల సాయం అందించడం పెద్దకష్టమేమీ కాదు.

టీడీపీ ప్రభుత్వం కొన్నట్టే పాడైన ప్రతి ధాన్యం గింజను జగన్ రెడ్డి తన ప్రభుత్వంతో కొనిపించి.. రైతులకు వెంటనే డబ్బు చెల్లించాలి
గతంలో టీడీపీప్రభుత్వం నిబంధనలు సడలించి మరీ తడిచిన.. రంగుమారిన ధాన్యాన్ని గిట్టుబాటుధరకు కొని రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించింది. అదే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే నీటమునిగిన వరిపైరు నుంచి రైతులు వేరుచేసిన ధాన్యాన్ని.. పనికిరాని ప్రతి ధాన్యం గింజను కొని.. వెంటనే డబ్బులు చెల్లించి అన్నదాతలకు అండగా నిలవాలి. గతంలో రూ.2917కోట్ల పంట నష్టపరిహారం సొమ్ము రైతులకు ఇస్తున్నట్టు జగన్ రెడ్డి మీట నొక్కాడు.

ఇది జరిగి సంవత్సరం అవుతున్నా.. రూపాయి కూడా నేటికీ రైతులకు అందలేదు. మరలా ఇప్పుడు మిగ్ జాం తుఫాన్ ప్రభావంతో రైతులు సర్వం కోల్పోయారు. జరిగిన నష్టానికి మించి ప్రతి రైతుని ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి.. ఈ ప్రభుత్వానిదే. ఇప్పుడు రైతులు ఉన్న దుస్థితిలో వారిని ఆదుకోకుంటే జగన్ రెడ్డి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాడు.

మిగ్ జాం బాధితులైన ప్రతి రైతు కన్నీళ్లు ముఖ్యమంత్రే తుడవాలి
మిగ్ జాం వల్ల సర్వంకోల్పోయిన ప్రతిరైతు కన్నీళ్లు ముఖ్యమంత్రే తుడవాలి. నిబంధనలు పక్కన పెట్టి మరీ మానవతాధృక్పథంతో జగన్ రెడ్డి అన్నదాతలకు అండగా నిలవాలి. తుఫాన్ వల్ల దెబ్బతిన్న హెక్టార్ వరిపైరుకు ప్రభుత్వం రూ.30 వేల ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి. గతంలో టీడీపీప్రభుత్వం రూ.20వేలు అందిస్తే.. అది సరిపోదని జగన్ రెడ్డే అన్నాడు. ఆనాడు జరిగిన నష్టం కంటే నేడు ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి.. రూ.30వేలు ఇవ్వాలంటున్నాం. అలానే ఆక్వా సాగుకి రూ.50వేలు ఇవ్వాలి.

హెక్టార్ అరటికి రూ.40వేలు.. హెక్టార్ చెరకు పైరుకి రూ.30వేలు.. హెక్టార్ పత్తికి రూ.25వేలు.. మిర్చికి రూ.50వేల పరిహారం అందించాలి. మొక్కజొన్న, జొన్న, ఇతర అపరాలకు హెక్టారుకు రూ.15వేలు .. జీడిపంటకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మిగ్ జాం తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి) రూ.10 లక్షల పరిహారం అందించాలి.

చనిపోయిన గొర్రెలు..ఇతర పశువులకు కూడా నష్టపరిహారం అందించాలి. కూలిపోయిన ఇళ్లు.. ఇతర నిర్మాణాలకు తగినంత ఆర్థికసాయం ప్రజలకు అందించాలి. జగన్ రెడ్డి తన వైఖరి మార్చుకొని, తక్షణమే రైతులవద్దకు వెళ్లి.. వారితో మాట్లాడి జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలి.” అని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.

LEAVE A RESPONSE