Home » 12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ లేఖ

12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ లేఖ

వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతోనే ఈ లేఖ రాసినట్లు తెలిపారు.నీట్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడంలో పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు స్టాలిన్. విద్యారంగంపై రాష్ట్రాల అధికారాలను పునరుద్ధరించుకునేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. ఇందుకోసం నీట్‌కు ప్రత్యామ్నాయంగా వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్‌ కమిటీ నివేదికను తాను రాసిన లేఖకు జతచేశారు. నీట్‌ కాకుండా, అందరు విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రవేశ విధానం, అమలు సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన అంశాలను సూచించాలని తమిళనాడు ప్రభుత్వం ఏకే రాజన్‌ కమిటీని కోరింది. కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు వైద్యవిద్య ప్రవేశ పరీక్షల చట్టానికి తమిళనాడు అసెంబ్లీ ఈమధ్యే ఆమోదం తెలిపింది.

Leave a Reply