– ఈ నగరంలో పని ఎవరు చేయాలి?
నగర ప్రజలు టాక్స్ కడుతున్నారు కదా?
– కార్పొరేటర్ శ్రవణ్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.113 కోట్లు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. వివిధ డివిజన్లలో చెరువుల్లోకి మురుగునీరు చేరి ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుర్రపుడెక్క, దోమల సంఖ్య పెరుగుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.113 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు మొత్తం 38 చెరువుల్లో మురుగునీటిని డైవర్ట్ చేసి శుభ్రం చేయడానికి, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కేటాయించబడ్డాయి.
ఈ నిధులు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కేవలం ఒక సూత్రప్రాయ అంగీకారమే. అది కూడా ఇవ్వలేదు. ఫైళ్లు పెండింగ్ లో పెట్టి రూ.113 కోట్లు అలాగే నిలిపేశారు. ప్రజల ఆరోగ్యం… చెరువుల శుభ్రత… రాష్ట్ర ప్రభుత్వానికి అసలు పట్టదా? GHMCను అడిగినా స్పందన లేదు . అడిగితే కేసులు పెట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నిసార్లు GHMCకి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. వినతిపత్రాలు ఇస్తే పట్టించుకోరు… ధర్నా చేస్తే వెంటనే కేసులు బనాయిస్తారు.
బిజెపి కార్పొరేటర్లపై నిన్న జరిగిన పోలీసుల అమానుష వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అడిగింది ఒక్కటే: “కేంద్రం ఇచ్చిన 113 కోట్లపై మీ చర్యలు ఏమిటి? పనులు ఎందుకు ప్రారంభించలేదు?” లేదంటే — GHMCలో ఉన్న విభాగాల పేర్లు చెప్పినా మేము వెళ్లిపోతామని చెప్పాం. ఇంత చిన్న ప్రశ్నకే యువనాయకులను పాశవికంగా కొట్టడం దుర్మార్గం. కార్పొరేటర్‌గా GHMC నుంచి ప్రజల కోసం నిధులు అడగటం మా హక్కు మాత్రమే కాదు. మా బాధ్యత కూడా.
డ్యూటీ చేస్తున్న మమ్మల్ని ఇంత అమానుషంగా కొట్టడం అన్యాయం. కేంద్ర నిధులు ఎప్పుడు ఖర్చు చేస్తారు..? చెరువులను ఎప్పుడు శుభ్రం చేస్తారు..? గుర్రపుడెక్క పెరుగుతోంది… దోమల సమస్య పెరుగుతోంది… ఇన్ని సమస్యలు కనిపించినాకూడా రాష్ట్ర ప్రభుత్వం కదలట్లేదు. మేయర్, కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరవాలి.
నగరంలో 5—6 శాఖలు… కానీ ఒక్కదగ్గరా నిధులు లేవు! ఒకే నగరంలో GHMC, HMDA, కలెక్టర్లు, వాటర్ వర్క్స్… ఇన్ని శాఖలు ఉన్నా.. “డ్రైనేజ్ పైపులు మార్చండి” అంటే — నిధులు లేవు “గుర్రపుడెక్క తీసేయండి” అంటే — నిధులు లేవు, “మురుగునీటి శుద్ధీకరణ చేయండి” అంటే — నిధులు లేవు, “స్ట్రీట్ లైట్లు వేయండి” అంటే — నిధులు లేవు, … మరి ఈ నగరంలో పని ఎవరు చేయాలి? నగర ప్రజలు టాక్స్ కడుతున్నారు కదా.? పరిపాలన నడవాలంటే ప్రభుత్వం పని చేయాలి. మేయర్ గారు, కమిషనర్ గారు, ముఖ్యమంత్రి గారు — దీనిపై మీ స్పందన ఎక్కడ? ప్రజా సమస్యలపై బిజెపి పోరాటం ఆగదు. ప్రజా సమస్యలపై, కేంద్ర నిధుల వినియోగంపై, నగర అభివృద్ధిపై బిజెపి పోరాటం కొనసాగుతుంది.