Suryaa.co.in

Andhra Pradesh

వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు..

ప్రజలందరి దీవెనతో ముందుకు వెళ్తున్న తనను ఎవరు ఏం చేయలేరంటూ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి). నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేశారు సీఎం జగన్. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని మండిపడ్డారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. ఇవేవి నన్ను కదిలించలేవు, బెదిరించలేవు, దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చా. వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని కోరుకుంటటున్నానన్నారు.

ఇక్కడ అనేక విధాలుగా రచ్చ చేస్తున్న ఆ నేతలు.. ఢిల్లీలో ఏపీ పరువును దిగజార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 10 లక్షల 68 వేల 150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 1,024 కోట్ల రూపాయలు జమ చేశారు. తాము చేపట్టే పథకాలతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయన్న సీఎం జగన్.. డ్రాపవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు శారీరక ఎదుగుదల కోసం పథకాలు రూపొందించామన్నారు. అడ్మిషన్ల కోసం ప్రభుత్వ బడులు ఎమ్మెల్యేలు రెకమిండేషన్‌ చేసే స్థాయికి ఎదిగాయన్నారు.

నాడు-నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ.. సర్కారీ బడులకు మంచి రోజులు తీసుకొచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, యెల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్‌ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు.దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ చెప్పారు.

LEAVE A RESPONSE