Suryaa.co.in

Andhra Pradesh

సీఎం వైయస్ జగన్ రైతుపక్షపాతి

– వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యం
– ఇప్పటి వరకు కొత్తగా 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం
– మరో 77వేల కనెక్షన్ లను త్వరలోనే ఇవ్వబోతున్నాం
– 2023 మార్చి నాటికి నూరుశాతం వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు
– విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుంది
– ఇప్పటికే 70 శాతం మంది రైతులు డిబిటి కోసం ఖాతాలను తెరిచారు
– అక్టోబర్ 15 నాటికి నూరుశాతం ఖాతాలను ఓపెన్ చేయడం పూర్తవుతుంది
– స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోందని తెలిసింది.
– శ్రీకాకుళం జిల్లాలో ఇది నిరూపితం అయ్యింది
– స్మార్ట్ మీటర్లపై మాట్లాడే విపక్షాలు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలి
– రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుందో అప్పుడు మాట్లాడాలి
– చంద్రబాబు ఆయనకు వంతపాడే జనసేన, కమ్యూనిస్ట్ లే రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు
– స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణం
– ఎవరి చేతులను ఎవరూ నరకలేరు… ఇటువంటి మాటలతో వారి చేతులు వారే నరుక్కుంటున్నారు
– రానున్న ఎన్నికల తరువాత వారికి ఇది అర్థమవుతుంది
– రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారు
– స్మార్ట్ మీటర్ల వల్ల ఏ రైతుపైనా భారం పడదు
– నాణ్యమైన విద్యుత్ కోసం తమ హక్కుగా మాట్లాడే స్థాయి రైతులకు పెరుగుతుంది
– సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

అమరావతి: ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఎటువంటి అంతరాయాలు లేకుండా అందించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతుపక్షపాతిగా ఈ దేశంలో ఎవరూ చేయనంతగా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. గురువారం సచివాలయంలోని మూడో బ్లాక్ లో ఇంధన శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 41 వేల కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లను మంజూరు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరో 77వేల కొత్త కనెక్షన్ లను త్వరలోనే రైతులకు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోందని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తరువాత కూడా ఈ భారం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి, రైతులు ఏ మేరకు విద్యుత్ ను వినియోగిస్తున్నారో అధికారులు అధ్యయనం చేశారని తెలిపారు. ఈ జిల్లాలో సాధారణంగా ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగంకు ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం కన్నా 30 శాతం తక్కువగానే రైతులు విద్యుత్ ను వినియోగిస్తున్నట్లు తేలిందని అన్నారు.

దీనితో ఉచిత విద్యుత్ భారం కూడా ప్రభుత్వంపై 30 శాతం తగ్గుతుందని గుర్తించామని వెల్లడించారు. ఇదే విధానంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, 2023 మార్చి నాటికి రాష్ట్ర మొత్తంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని సూచించారు. రైతులు కూడా తమ వ్యవసాయ కనెక్షన్ లకు డిబిటి కోసం ఖాతాలు తెరిచేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఇప్పటికే 70 శాతంకు పైగా రైతులు బ్యాంక్ ఖాతాలను తెరిచారని, అక్టోబర్ 15 నాటికి నూరుశాతం బ్యాంక్ ఖాతాలను తెరవడం, ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. బ్యాంక్ లతో పాటు పోస్టాఫీస్ లలో కూడా రైతులు ఖాతాలు తెరవవచ్చని అన్నారు.

”రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు”
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై విపక్షాలు రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయనకు తోక పార్టీలుగా వ్యవహరిస్తున్న కమ్యూనిస్ట్ లు, జనసేన తమ రాజకీయ స్వార్థంతో రైతుల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు. విచక్షణ కోల్పోయి చేతులు, వేళ్ళు నరకాలని పిలుపునిస్తున్న విపక్ష నేతలు తమ చేతులనే నరుక్కుంటున్నారని, వచ్చే ఎన్నికల తరువాత ఈ విషయం వారికి అర్థమవుతుందని అన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. విపక్ష నేతలు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి, అక్కడి రైతులతో మాట్లాడిన తరువాత దీనిపై స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు.

”రైతుసంక్షేమానికే పెద్దపీట”
సీఎం వైయస్ జగన్ రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఇథోపియా దేశం మన రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను తెలుసుకుని, ఇక్కడ పర్యటించి ఒక సర్వే కూడా చేసిందని తెలిపారు. ప్రపంచబ్యాంక్ సహకారంతో ఇటువంటి వ్యవస్థను తమ దేశాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ఆఫ్రికన్ దేశాలు ఆలోచిస్తున్నాయని అన్నారు. వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న గొప్పపనికి ఇది నిదర్శనమని అన్నారు. స్మార్ట్ మీటర్లు కూడా రైతుల్లో జవాబుదారీతనం, తమ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని వారే స్వయంగా డిస్కం లకు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్ పై వారు ప్రశ్నించే హక్కును మరింతగా పొందుతారని అన్నారు.

ఈ సమీక్షలో ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్, ట్రాన్స్ కో సిఎండి బి.శ్రీధర్, జెఎండి పృథ్వితేజ్, డిప్యూటీ సెక్రటరీ కుమార్ రెడ్డి, డిస్కం సిఎండిలు కె. సంతోష్ రావు, జె.పద్మాజనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE