- ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు
- భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌కార్డులు ఇవ్వాలి
- అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశం
- వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం సమీక్ష
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని, రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందేనని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్ డిపార్ట్‌మెంట్లతో సమన్వయం ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ కార్డులు ఇవ్వాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. సాయిల్‌కార్డులతో పాటు ఆ భూమికి తగిన విధంగా ఎరువులు, పంటల సాగుపై సలహాలు అందించాలని సూచించారు. ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సివిల్ సప్లయిస్ కమిషనర్ గిరిజా శంకర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సి. హరికిరణ్, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ వీరపాండ్యన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.