-లైమ్ సిటీగా పేరొందిన పిడుగురాళ్ల లో సున్నపు పరిశ్రమకి కష్ట పరిస్థితులు
-పార్లమెంట్ లో కేంద్రానికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి
పల్నాడులో గుంటూరు-హైదరాబాద్ హైవేపై ఉన్న లైమ్ సిటీగా పేరొందిన పిడుగురాళ్లలో బొగ్గు గనిని కేటాయించాలని, సున్నపు రాయి పరిశ్రమ ఉత్పత్తులకు బొగ్గును సబ్సిడీ కి ఇవ్వాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.పార్లమెంట్ జీరో అవర్ లో మాట్లాడారు. సున్నపు రాయి పరిశ్రమలకు కేంద్రంగా పిడుగురాళ్ల వెలుగొందేదని, ప్రస్తుతం ఈ పరిశ్రమకు కష్ట పరిస్థితులు వచ్చాయని వెల్లడించారు.
1995 నుండి, డిమాండ్ క్షీణించడం వల్ల ఈ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దీనికి తోడు కరోనా సమయంలో ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఇది మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు.2021లో టన్ను బొగ్గు ధర రూ.11,200 కాగా ఇప్పుడు అది రూ.14,700కి పెరిగిందని, 2020లో పెట్‌కోక్ ధర టన్నుకు కేవలం రూ.8,500 ఉండగా, ఇప్పుడు అది టన్నుకు రూ.18,500కి చేరుకుందని వెల్లడించారు.
బొగ్గు, పెట్‌కోక్ లభ్యత కూడా ప్రధాన సమస్యగా మారిందని, దీని వల్ల తయారీదారులు సున్నం పొడి తయారీలో టన్నుకు రూ.400-500 నష్టపోతున్నట్లు వివరించారు.ఈ పరిస్థితులు దృష్ట్యా పిడుగురాళ్ల లో సున్నపు పరిశ్రమకి పూర్వ వైభవం అందించేలా కేంద్రం సహకరించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.