– ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన హోంమంత్రి అనిత
– కప్పిపుచ్చుకునేందుకు వైయస్ఆర్సీపీపై ఎదురుదాడి
– ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రుల సపోర్టుతోనే శ్రీకాంత్‌కు పెరోల్
– పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్
తాడేపల్లి: నెల్లూరుకు చెందిన శ్రీకాంత్ అనే ఖైదీకి అధికారులు తిరస్కరించినా కూడా పట్టించుకోకుండా రెండుసార్లు సిఫారస్ చేసి మరీ పెరోల్ ఇప్పించిన ఘనత ఈ రాష్ట్ర హోమంత్రి అనితకే దక్కుతుందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్ పెరోల్ విషయం మీడియా ద్వారా వెలుగు చూడటంతో హోంమంత్రి అనిత, అతని పెరోల్‌కు సిఫారస్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మాజీ మంత్రులు దానిని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని అన్నారు.
జిల్లా ఎస్పీ నిరాకరించిన ఫైల్‌ను రికమండ్ చేసి, సీఎంఓకు పంపిన అనిత దీనికి బాధ్యురాలు కాదా అని ప్రశ్నించారు. తన నిర్వాకంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని గ్రహించి, జరిగిన దానిని వైయస్ఆర్సీపీపై నెట్టేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరుకి చెందిన శ్రీకాంత్ అనే ఖైదీకి పెరోల్ ఇప్పించే విషయంలో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అడ్డంగా బుక్కయ్యారు. హోంమంత్రి అనిత దానిని సమర్థించుకునేందుకు, విషయాన్ని డైవర్ట్ చేసేందుకు మీడియా సమావేశంలో నానాపాట్లు పడ్డారు. అసలు శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరు..? ఆయనతో పరిచయం ఉన్న అరుణ ఎవరు..? వారితో ఉన్న సంబంధాలను దాయడానికి చంద్రబాబు ప్రభుత్వం, హోంమంత్రి ఎందుకు ఇన్ని పాట్లు పడుతున్నారు..?
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోవాలని హోమాలు, దీక్షలు చేశాను అని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ మీడియా సాక్షిగా చెప్పింది. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి వంటి వారితో ఆమెకు పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నాం.
అటువంటి అరుణ ఈ టీడీపీ నేతల సహకారంతో తనకు సన్నిహితుడైన శ్రీకాంత్‌కు పెరోల్ తెచ్చుకునేందుకు ప్రయత్నించడాన్ని వైయస్ఆర్సీపీకి ఎలా అంటగడతారు..? శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసింది చంద్రబాబు సర్కార్ కాదా..? టీడీపీ ఎమ్మెల్యేలు రికమండ్ చేస్తే, హోమంత్రిగా అనిత వాటిని పరిశీలించకుండానే సీఎంఓకు ఫైల్‌ను పంపించారా..? ఇవ్వన్నీ వాస్తవాలు అయితే, తాజాగా తనకేమీ తెలియదన్నట్లుగా హోంమంత్రి అనిత మీడియా ముందు వాపోతుండటం డ్రామా కాదా..?
శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీషీటర్ అని మీరే అంటున్నారు. అలాంటప్పుడు అతనికి పెరోల్ ఎలా ఇచ్చారో అనిత చెప్పాలి. ఏడాది కాలంలో రెండు సార్లు పెరోల్ ఇవ్వడానికి హోంమంత్రి అనితకు ఉన్న ఆసక్తి ఏమిటో ప్రజలకు వెల్లడించాలి.? తన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న నిర్వాకంపై విచారణకు ఆదేశించే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా.? గతంలో ఇదే హోంమంత్రి పీఏపై వచ్చిన అవినీతి ఆరోపణలపైన ఇంత వరకు దర్యాప్తు జరిగిందా.?