Suryaa.co.in

Andhra Pradesh

ఎంపి రాజు అరెస్టు నాటి కాల్‌డేటా సేకరించండి

– సీబీఐకి హైకోర్టు ఆదేశం
– సీఐడికి ఆదేశాలివ్వాలన్న సీబీఐ న్యాయవాది
– ఫిర్యాదు వారిపైనే వస్తే వారికెలా ఇస్తామన్న హైకోర్టు
– ఎంపి రాజు కస్టోడియల్ టార్చర్‌పై జగన్ సర్కారుకు హైకోర్టు షాక్
– కాల్‌డేటాను సేకరించమనడం చట్టవిరుద్ధమన్న సీఐడీ
– సీఐడీ ఇంప్లీడ్ పిటిషన్‌ను ఇంకా ఆమోదించలేదన్న హైకోర్టు

ఎట్టకేలకు న్యాయం ఆలస్యంగా జరగడం ప్రారంభమవుతోంది. సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసిన ఎపిసోడ్‌లో.. తనను హింసించిన వైనంపై కోర్టుకెక్కిన వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు కేసు ఆలస్యంగానయినా కదిలి, అది ఊహించని మలుపు తిరిగింది.

ఎంపి రాజు కస్టోడియల్ టార్చర్‌కు సంబంధించి, అప్పటి సెల్‌ఫోన్ కాల్‌డేటాను సేకరించాలని, ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి ఎంపి రఘురామకృష్ణంరాజు.. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్, హోంమంత్రి, ప్రివిలేజ్ కమిటీకి చేసిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

నర్సాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు, అనూహ్య మలుపు తిరగడం చర్చనీయాంశమయింది. సీఐడీ పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారంటూ.. ఆయన చేసిన ఫిర్యాదు వ్యవహారం, ఇప్పుడు అటు తిరిగి సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పటి కాల్‌డేటాను సేకరించే బాధ్యతను హైకోర్టు, సీబీఐకి అప్పగించటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్దించారు.

తర్వాత సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ సిఐడీ వద్ద ఉందని, అందువల్ల కాల్ డేటాను సీఐడీ అధికారులే సేకరించాలని అన్నారు.

పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. కాగా ఈ కేసులో సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని సీఐడీ తరపు న్యాయవాది అన్నారు. అయితే సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్‌ను ఇంకా అనుమతించలేదని హైకోర్టు పేర్కొంది.

సీబీఐకు ఇవ్వాలా… లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని, ఈ కేసులో కాల్ డేటా కీలకమని న్యాయవాది నౌమీన్ వాదించారు. దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది.

LEAVE A RESPONSE