– బీజేపీ నేత సత్యకుమార్ రగిలించిన అగ్గి
– పేరు తొలగించాల్సిందేనన్న బీజేపీ
– చివరాఖరకు రంగులతో దిగివచ్చిన సర్కార్
– మరి జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరదా?
– పక్కనే గద్దె కట్టి జెండా ఎగురవేస్తారట
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొంతమంది బతికి సాధిస్తారు. మరికొందరు చచ్చి సాధిస్తారు. పాకిస్తాన్ జాతిపిత, గుంటూరు జిన్నా టవర్‌లో ఆత్మరూపంలో తిష్టవేసిన మహ్మద్ ఆలీ జిన్నా అందులో రెండో టైపు.
గుంటూరు సిటీలోని జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేవనెత్తిన డిమాండ్, జగన్ సర్కారును సంకటంలో పడేసింది. నిజమైన దేశభక్తులెవరూ ఇంకా జిన్నా పేరు కొనసాగించేందుకు ఇష్టపడరని, తక్షణం టవర్‌కు జిన్నా పేరు తొలగించాలని సత్య చేసిన డిమాండ్
రాష్ట్రంలో చర్చనీయాంశమయింది. దానిని బీజేపీ జిల్లా శాఖలు అందుకుని గళమెత్తాయి. గుంటూరు జిల్లా బీజేపీ నేత పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ మేరకు జరిగిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. జిన్నా పేరు మార్పు అంశం చివరకు జాతీయ స్థాయికి చేరింది. ప్రతిరోజూ భాజపా-వైకాపా మధ్య మాటల యుద్ధం జరిగింది. జిన్నా పేరు మార్చకపోతే తామే టవర్‌పై జాతీయ జెండా ఎగురవేస్తామని పాటిబండ్ల చేసిన హెచ్చరిక, సర్కారును కలవరపరిచింది.
అయితే ఈ అంశంపై వైసీపీ ఎంత ఎదురుదాడి చేసినా, జిన్నా పేరు మార్పు విషయంలో మాత్రం మొహమాటంతోనే ఉంది. స్థానిక ముస్లిములను సమీకరించడం, బీజేపీ-టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేరు ఎందుకు మార్చులేదని మంత్రి వెల్లంపల్లి తదితరులు ఎదురుదాడి చేసినప్పటికీ, బీజేపీ తెరపైకి తెచ్చిన సెంటిమెంటును మాత్రం పక్కదారి మళ్లించలేకపోయారు.
దీనితో గుంటూరు కార్పొరేషన్‌లో పాలక వైసీపీ వస్తాదులు మధ్యేమార్గాన్ని ఎన్నుకున్నట్లు కనిపించింది. అందులో భాగంగా జిన్నావర్‌కు జాతీయ పతాకంలోని మూడురంగులు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దానిని పూర్తి చేసింది. 3వ తేదీన అక్కడ జాతీయ జెండా ఎగురవేస్తామని మేయర్ కావేటి వెల్లడించారు. బాగానే ఉంది. ఇక్కడి వరకూ ఏమాత్రం బలం లేని బీజేపీ.. జిన్నా టవర్ అంశంలో ఎంతో పొలిటికల్ మైలేజీ సాధించినట్లు లెక్క. అయితే దానిని సోము వీర్రాజన్నయ్య తన సారా లెక్కలతో విజయవంతంగా నీరుగార్చి, సత్యకుమార్ పడిన కష్టాన్ని అంతే విజయవంతంగా సమాధి చేశారనుకోండి. అది వేరే విషయం! ఎందుకంటే ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ జిన్నా టవర్‌కు మూడు రంగులు కనిపించింది లేదు. తాజా నిర్ణయంతో జాతీయవాదులు- భారతీయుల పుణ్యం పుచ్చినట్లే లెక్క. అక్కడ మూడు రంగులు వేయడమే జాతీయవాదులకు మహదానందం. జాతీయవాదులపై కరుణించినందుకు జగనన్న సర్కారుకు సలాము కొట్టి, గులాములవాల్సిందే.
బాగానే ఉంది. అక్కడే జాతీయ జెండా ఎగురవేస్తామని మేయర్ సెలవిచ్చారు. అయితే ఆ ఎగిరే జెండా జిన్నా టవర్‌పై కాదట. పక్కనే కట్టిస్తున్న ఓ ప్రత్యేకమైన గద్దెపైనట. మరి టవర్‌పై భారతీయ జెండా ఎగురవేస్తే జిన్నా సాబ్ ఆత్మ ఒప్పుకోదనో, లేక పాకిస్తాన్ జాతిపిత ఆవహించిన ఆ టవరుపై ఇండియా జెండా ఎగురవేస్తే పాకిస్తానీయులు.. వారంటే ఇప్పటికీ పడిచచ్చి చెవులు కోసుకునే కొందరు అభిమానులు, కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో భారత సైన్యంపై వారి ‘దేశభక్త’ చర్యలకు మురిసిముచ్చట పడి, వాటిని ఖండించకుండా నవరంధ్రాలూ మూసుకునే ఇండియన్ సెక్యులరిస్టులు ఫీలవుతారనో.. మరి తెలియదు గాని.. జిన్నా టవర్‌పై కాకుండా, ఆ పక్కనే కట్టించిన గద్దెపై మాత్రం జాతీయ జెండా ఎగురవేస్తారట. పోనీలెండి. స్వతంత్ర భారతదేశంలో జాతీయ జెండాకు ఇంత చోటయినా దొరికింది. అప్పటికిదే మహద్భాగ్యం. ఏదేమైనా చచ్చిపోయిన జిన్నా సాధించాడు. బతికున్న భారతీయులు రేపటి ఆ దృశ్యాన్ని చూడనున్నారు. గ్రేట్!
జిన్నా టవర్‌ను భారతీయ రంగులతో ముంచెత్తిన పాలకులు, ఆ పేరు మాత్రం మార్చడానికి ఎందుకు
జంకుతున్నారన్నది ప్రశ్న. అసలు జిన్నా గుంటూరు వాడు కాదు. ఆ పేరు మారిస్తే, ఆయన వారసులు యాగీ చేసి మైనారిటీలందరినీ ఏకం చేసి గత్తర చేస్తే వచ్చే ఓట్లు పోతాయనునేందుకు, జిన్నా కుటుంబ వారసులెవ రూ అక్కడ లేరు. ‘మా జాతిపిత పేరు ఎందుకు మార్చావోయ్’ అని పాకిస్తాన్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్
గానీ, ఇండియాలో ఉన్న పాక్ రాయబార కార్యాలయం గానీ జగనన్నకు సమన్లు ఇవ్వవు. పోనీ.. జిన్నా పేరు మారిస్తే మా ఓట్లు వేయమని గుంటూరు ముస్లిములు ఒకవేళ అల్టిమేటమ్ ఇస్తే, బీజేపీ సత్య సాబ్ చెప్పినట్లు.. నిఖార్సయిన దేశభక్త ముస్లిమయిన అబ్దుల్‌కలామ్ పేరు పెట్టవచ్చు. ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ, జగనన్న సర్కారుకు జిన్నా పేరుపై ఎందుకంత వల్లమాలిన అభిమానమో అర్ధం కావడం లేదన్నది బుద్ధిజీవుల సందేహం.