– అసెంబ్లీ సాక్షిగా అబద్దాలా?
– కరేడు రైతులు స్వచ్చంధంగా భూములు ఇస్తున్నారా?
– కరేడు ఊరు పేరు కూడా పలకలేని మంత్రికి రైతుల ఉద్యమం కనిపించకపోవడం బాధాకరం
– ఇవే మాటలు అసెంబ్లీలో కాదు కరేడులో అని చూడండి… రైతుల రియాక్షన్ ఎలా ఉంటుందో
– కరేడు భూముల వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలకు బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కౌంటర్
అమరావతి: కరేడు భూ సేకరణపై శాసనమండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నీ అబద్దాలే చెప్పారని బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కరేడు పేరు కూడా పలకలేని మంత్రి… భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారంటూ అబద్దాలను వల్లె వేశారన్నారు. ఈ మేరకు రామచంద్ర యాదవ్ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇండో సోల్ సోలార్ ప్రాజెక్టు కు భూములు ఇవ్వబోమని రైతులు ఉద్యమం చేస్తుంటే… రైతులే స్వచ్చందంగా భూములు ఇస్తున్నారని అబద్దాలు చెప్పడం దారుణమన్నారు. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నా… ప్రభుత్వమే బలవంతంగా భూములను లాక్కుంటోందని ఆరోపించారు. దమ్ముంటే కరేడుకు వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలన్నారు. శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు కరేడులో చేయగలరా? అని సవాల్ విసిరారు.
కరేడు రైతుల సమస్యలను చెప్పుకునేందుకు బిసివై పార్టీ తరుపున అపాయింట్ మెంట్ అడిగితే ఇప్పటి వరకు సిఎం స్పందించలేదన్నారు. ఇండో సోల్ సోలార్ ప్రాజెక్ట్ కు వైసిపి, టిడిపిలో దోచి పెట్టేందుకు పోటీలు పడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదవడం మానేసి క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకోవాలని రామచంద్ర యాదవ్ ఆ ప్రకటనలో హితవు పలికారు.