Suryaa.co.in

Andhra Pradesh

ఏపీకి త‌ర‌లివ‌చ్చేందుకు కంపెనీలు ఆస‌క్తిగా ఉన్నాయి

– పారిశ్రామిక పార్కుల్లో అన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాం
– ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మాట్లాడిన మంత్రి టి.జి భ‌ర‌త్

విజయవాడ: రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో అన్ని మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి టి.జి భ‌ర‌త్ స‌మాధానం ఇచ్చారు.

కృష్ణాజిల్లా బాపుల‌పాడు మండ‌లం, మ‌ల్ల‌వ‌ల్లిలో 1,360 ఎక‌రాల్లో మోడ‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ మ‌రియు 100 ఎక‌రాల్లో మెగా ఫుడ్ పార్క్ మ‌రియు స్టేట్ ఫుడ్ పార్కును ఏర్పాటు చేయ‌డం కోసం ఏపిఐఐసి భూమిని సేక‌రించ‌డ‌మైంద‌ని చెప్పారు.

మ‌ల్ల‌వ‌ల్లి పారిశ్రామిక పార్కులో భూ వివాదాలు లేని ప్రాంతాల్లో బి.టి రోడ్లు, సిసి డ్రెయిన్లు, వీధి దీపాలు వంటి మౌలిక స‌దుపాయాలు ఏపిఐఐసి క‌ల్పించింద‌న్నారు. ఇక పారిశ్రామిక పార్కు యూనిట్ల‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల సౌక‌ర్యార్థం ఏపిఎస్ఆర్టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. బాహ్య నీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించి 20 కిలోమీట‌ర్లు దూరం ప‌నులు త్వ‌ర‌లో పూర్తిచేస్తామ‌ని మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు.

గత ప్రభుత్వంలో ఏపి నుండి వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ మళ్ళీ రాష్ట్రానికి రావడంతో పాటు ఉన్న కంపెనీని మరింత విస్తరించే దిశలో ఉందన్నారు. దీంతో పాటు ఇత‌ర కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మ‌ల్ల‌వ‌ల్లి పారిశ్రామిక పార్కులో 9 పెద్ద కంపెనీలు రావడం జ‌రిగింద‌న్నారు. పోలీస్ ఔట్ పోస్టు, ఫైర్ స్టేష‌న్ కు చ‌ర్య‌లు తీసుకొని పూర్తి చేస్తామ‌న్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ పారిశ్రామిక పార్కుల వ‌ద్ద ఆర్చ్ ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్‌ను కూడా తీసుకునేందుకు చ‌ర్చిస్తామ‌న్నారు. ఇక పారిశ్రామిక పార్కుల్లో భూవివాదాలు ప‌రిష్క‌రించేందుకు లీగ‌ల్ ఫ‌ర్మ్ ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE