Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి తొత్తులుగా ఆ అధికారులు…

-అధికారులపై తెదేపా నేతల ఫిర్యాదు
-అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష సమాధానం చెబుతున్నారు
-గడువు ముగిసిన జెపి వెంచర్స్ బిల్లుతో పామర్రులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-తెదేపా నేతలపై పెట్టిన కేసుల వివరాలు తెలియపరచాలని డీజీపీని కోరినా సమాధానం కరువు
– తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు

అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది ప్రభుత్వ అధికారులపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్ధులపై ఉన్న కేసు వివరాలు జత చేయాల్సి ఉండగా రాష్ట్ర డీజీపీకి లేఖ రాసినా ఎస్పీని కోరండని నిర్లక్ష సమాధానం చెప్పారని, జిల్లా ఎస్పీలకు లేఖలు రాసినా కేసు వివరాలు వారు తెలియపరచడం లేదని ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు పాల్గొన్నారు.

ఖనిజ సంపదను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుంది: వర్ల రామయ్య
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత అవినీతి, అధికార దుర్వినియోగం, దోపిడీలు తగ్గాల్సింది పోయి అందుకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అయితే మాకేంటి, మమ్మల్ని ఎవరు ఆపగలరు, నిరోధించగలరనే రీతిలో జగన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని, ఖనిజ సంపదను వైసీపీ ప్రభుత్వం దోచుకుంటూ ఎన్నికల్లో ఆ డబ్బును వాడుకోవాలని చూస్తుందని వర్ల రామయ్య దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”ఎన్నికల కోడ్ అయితే మాకేంటి అనే రీతిలో జగన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందనడానికి కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం, లంకపల్లిలో యథేచ్చగా జరుగుతున్న ఇసుక మాఫియానే ముఖ్య ఉదాహరణ. స్థానిక ఎమ్మెల్యే కైలె అనిల్ కుమార్ కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఇదేమిటని స్థానిక నాయకులు అడ్డుకుంటే ఎమ్మెల్యే పేరు చెప్పి, ఎప్పుడో గడువు ముగిసిన జెపి వెంచర్స్ బిల్లులు చూపించారు. అక్రమ రవాణా జరుగుతోందని స్థానిక ఎస్సైకి కాల్ చేసి చెప్తే అది మా డ్యూటీ కాదు మైనింగ్ అధికారులకు చెప్పండని అన్నారు.

మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డికి చెప్తే ఎన్నికల అధికారికి చెప్పుకోండి, నాకు సంబంధం లేదని నిర్లక్ష సమాధానం చేప్పారు. తాహసీల్దార్‌కు చెప్తే ఇద్దరు వీఆర్ఓలను పంపించారు. ట్రక్క్‌లు వీఆర్ఓల మీదుగా వస్తుంటే వారిద్దరు పారిపోయారు. రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్‌కు చెప్తే అది మా డ్యూటీ కాదు అని తప్పించుకున్నారు. ఏమిటీ అన్యాయమని జిల్లా కలెక్టర్‌కు చెప్తే, 5 నిమిషాలు ఇవ్వండి ఆపుతానని చెప్పి ఒక కానిస్టేబుల్‌ను అక్కడికి పంపించాడు. పెద్ద సాండ్ మాఫియాను ఒక కానిస్టేబుల్ ఆపగలడా?

అక్రమ ఇసుక రవాణాను చిత్రీకరించి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు చూపించి ఫిర్యాదు చేశాం. జిల్లా కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి రిపోర్ట్ తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకుంటున్న మైనింగ్ ఏడీ, స్థానిక ఎస్సై ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని అని కలెక్టర్, ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు. వైసీపీ చేస్తున్న అక్రమాలను గుర్తించి భవిష్యత్తులో తగిన బుద్ది చేప్పాలని ప్రజలను కోరుతున్నామని వర్ల రామయ్య తెలిపారు.

ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర: బోండా ఉమా
కొంతమంది ఐపిఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. డబ్బు, మద్యం సరఫరా చేస్తున్న విశ్వంత్ రెడ్డి, తప్పుడు కేసులతో తెలుగుదేశం, జనసేన నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొల్లు రఘురాం రెడ్డి, జగన్ రెడ్డి ఆదేశాలనుసారం ప్రతిపక్షాల ఫోన్‌లు ట్యాపింగ్ చేస్తున్న ముగ్గురు అడిషనల్ ఎస్పీ క్యాడర్ అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.

వీళ్ళందరిపై ఉన్నత స్థాయి విచారణ చేసి నిజా నిజాలు బయట పెట్టాలి. అప్పటివరకు వారిని విధుల నుంచి తప్పించాలని సీఈఓని కోరినట్లు బోండా ఉమా తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…”తెలుగుదేశం నాయకుల మీద రాష్ట్రంలో ఎక్కడెక్కడో కేసులు పెట్టారు. ఆ వివరాలన్నీ డీజీపీ వద్ద ఉంటాయి. ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్ధులు వాని మీద ఉన్న కేసు వివరాలు జత చేయాలి కాబట్టి.. మా మీద ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీకి మేము లేఖ రాశాము. జిల్లా ఎస్పీని కోరండి అని డీజీపీ నిర్లక్ష సమాధానం చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలకు మేము లేఖలు పంపించాం. కానీ ఇప్పటివరకు ఏ జిల్లా ఎస్పీ కూడా స్పందించలేదు. దానిపై లిఖితపూర్వకంగా ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు జగన్మోహన్ రెడి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ, క్యాబినేట్ హోదాలో ఉన్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద ఫిర్యాదు చేశాం. వీటన్నిటిపై ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి మాకు హామీ ఇచ్చారు” అని బోండా ఉమా తెలియజేశారు

LEAVE A RESPONSE