అధికారులపై చర్యలు తీసుకోవాలి
మైదుకూరు : అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్టు మైదుకూరుకు చెందిన బీపీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
మైదుకూరులో రూ. కోటి వ్యయంతో నిర్మించిన పశుదాణా కర్మాగారం ట్రైల్ రన్ తోనే మూతపడిందని తెలిపారు. పీఎంఎఫ్ తో పాటు పశుదాణా కర్మాగారం కూడా లిక్విడేషన్ లోకి వెళ్లిందని పేర్కొన్నారు. కర్మాగారం భూమిని ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరినట్టు ప్రతాపరెడ్డి తెలిపారు. మైదుకూరులో పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం కింద మహిళా డెయిరీ ని ఏర్పాటు చేశారని, అయితే డెయిరీ సామాగ్రిని వినియోగించకుండానే మూసివేశారని పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తను కోరినట్టు తెలిపారు.
మైదుకూరు పశువుల సంతను స్థానిక బద్వేల్ రోడ్డులోని గగ్గితిప్ప వద్ద రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానిని అక్కడ నుంచి స్థానిక నంద్యాల రోడ్డులోని మార్కెట్ కమిటీ ఆవరణంలోకి తరలించారని వివరించారు. దీనివల్ల ప్రజాధనం వృధా అయిందని లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు.
స్థానిక కేసీ కాలువ సమీపంలో 2004లో వ్యవసాయ శాఖ మండల ఏవో కార్యాలయాన్ని నిర్మించిందని, దానిని ఉపయోగించకపోవడంతో నిరుపయోగంగా మారి ప్రజాధనం వృధా అయిందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు.