– సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు “నేనుసైతం” ఫిర్యాదు
– ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలని వినతి
– సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలకు పెను ప్రమాదంలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తయారైందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తుల, శాసనసభ్యుల, కార్యనిర్వాహకుల, మీడియా ప్రతినిధుల ఫోన్లను టాపింగ్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం ప్రెస్ మీట్ లో చేసిన సంచలన వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో లోతైన, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం 1885 కు వ్యతిరేకంగా, ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తూ వ్యక్తిగత సంభాషణలను వింటూ ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రజాస్వామ్యనికి నాలుగు స్తంభాలైన వ్యవస్థలకు చెందిన వారి ఫోన్లను ట్యాపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
ప్రధానంగా న్యాయవ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోన్ తో పాటు ఇతర న్యాయమూర్తల, రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ల ఫోన్లలను ట్యాపింగ్ చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పత్రిక సమావేశంలో బహిరంగంగా చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇది న్యాయవ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రజాహితం కోసం తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ పై నిగ్గు తేల్చాలని కోరినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇందులో బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు క్రోడీకరిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని , ఇందుకు ఎమ్మెల్యే ఓ ఆధారాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా, న్యాయవ్యవస్థపై, మీడియా, అడ్మినిస్ట్రేటివ్ పై పెను ప్రభావం చూపే విధంగా సంచలనానికి కేంద్ర బిందువైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకొని లోతైన, పారదర్శకమైన విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమని తెలితే, ఫోన్ ట్యాపింగ్ చేసిన నిందితులపై ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం – 1885 ప్రకారం, ఆర్టికల్ 21 ఉల్లంఘనలతో పాటు చట్ట ప్రకారం కఠినచర్యలు తీసుకోని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరారు.