Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు

– స్థానిక సంస్థలకు పన్ను మినహాయింపు ఇవ్వడం వంటి విధాన నిర్ణయ అధికారం లేదని తెలిసీ మోసపూరిత ప్రకటనలు
– లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజయవాడ: వివిధ కారణాలతో మిగిలిఉన్న గ్రామపంచాయతీ ,ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ యదేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతూ ప్రభుత్వంలోకి వచ్చాక పన్నుల మినహాయింపు ఇస్తామంటూ అమాయక ఓటర్ల కన్నులు కప్పే ప్రయత్నం చేస్తూ ఉండటం తీవ్ర ఆక్షేపణీయమని, మోసపూరిత ప్రకటనలతో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన క్రిమినల్ చర్యలు కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి చేసిన ఫిర్యాదు ప్రతిని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ అంకమరెడ్డి నారాయణ మూర్తి ఎన్నికల కార్యాలయ అధికారికి అందజేశారు.
మిడతల పోరులా విడతలవారీగా సశేషంగా కొన”సాగుతూ” విశేషంగా మారిన స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న వికృత విధానాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్ర రాజకీయ చరిత్రకు మాయని మచ్చలా మారడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని తీవ్రంగా దుయ్యబట్టారు.
యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతూ మతిలేని హామీలతో , శృతిమించిన ప్రచారాలతో రాజ్యాంగ హననానికి పాల్పడుతూ స్థానిక ఎన్నికల విజయంతో విధాన నిర్ణయంలో తమ ప్రభావాన్ని చూపలేమని తెలిసినప్పటికీ రెండున్నర ఏళ్లలో తాము అధికారంలోకి వస్తామన్న భ్రమలో బ్రతుకుతూ మితిమీరిన విశ్వాసంతో నేడు మిస్డ్ కాల్ ఇచ్చిన వారికి రేపు పన్నులు మినహా ఇస్తామంటూ అమాయకపు ఓటర్ల కన్నులు కప్పే గారడి ప్రదర్శనకు వత్తాసు పలుకుతూ నీతిబాహ్యమైన ప్రచారానికి సహకరిస్తున్న ప్రసారమాధ్యమాల “పచ్చ”పాత ధోరణిని సైతం ఎండగట్టారు.
విధాన నిర్ణయాలలో స్థానిక సంస్థల భాగస్వామ్యం ఉండదని తెలిసినప్పటికీ కేవలం తన ఉనికిని చాటుకోవడానికి విలువలకు తిలోదకాలిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రసార మరియు సామాజిక మాధ్యమాలలో అనైతిక మోసపూరిత హామీలకు విస్తృత ప్రచారం కల్పిస్తూ తన అధికార దాహంతో అర్థరహితమైన స్పర్ధపూరితమైన వ్యాఖ్యలతో విభేదాలు సృష్టించి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పే కుట్రలకు తెరలేపుతున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీల క్రిమినల్ కార్యకలాపాలపై ఎలక్షన్ కమిషన్ తమకున్న విస్తృత అధికారాలతో కఠిన చర్యలు గైకొనాలని ఫిర్యాదు చేశారు.
రాజకీయాల కొరకు రాజ్యాంగాన్ని రాజ్యాంగ సంస్థలను కించపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి గొడ్డలి పెట్టులా మారిన తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడుల వ్యవహారశైలిపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకై ఇలాంటి వారిపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.

LEAVE A RESPONSE