Suryaa.co.in

Telangana

రాష్ట్రవ్యాప్తంగా కార్తీకమాస దీపోత్సవ వేడుకల నిర్వహణ

– 2 నవంబర్ 2024 నుండి 1 డిసెంబర్ 2024 వరకు
– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: కార్తీకమాసంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరివేసేలా దేవాదాయ శాఖ నేటి నుండి ‘సామూహిక కార్తీకమాస దీపోత్సవ వేడుకలు’ వైభవోపేతంగా నిర్వహిస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ ప్రకటించారు. 2 నవంబర్ 2024 నుండి 1 డిసంబర్ 2024 వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కార్తీకమాస దీపోత్సవ వేడుకలను కన్నులపండువగా నిర్వహించేలా కార్యనిర్వహణాధికారులు, అసిస్టెంట్ కమిషనర్లకు మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.

సామూహిక కార్తీక దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోలను నిర్దేశించారు.

* కార్తీక మాస దీపోత్సవ వేడుకలకు హాజరయ్యే మహిళా భక్తులకు ఉచితంగా పసుపు కుంకుమ అందిస్తారు
* ప్రధాన దేవాలయాల్లో మహిళా భక్తులకు బ్లౌజ్ పీస్ ల అందజేత
* ప్రతిరోజు సాయంత్రం సామూహిక దీపోత్సవ సమయంలో ప్రత్యేక ప్రసాద పంపిణీ
* సంబంధిత దేవాలయానికి చెందిన నిధులు, దాతల సహకారం ద్వారా ఇతర కార్యక్రమాల నిర్వహణ
* ప్రతిరోజు సాయంత్రం స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ
* కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజులను పురస్కరించుకుని మొత్తంగా కార్తీక మాసంలో ఐదు రోజులపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. స్థానిక కళాకారులతో పాటు, రాష్ట్ర, రాష్ట్రేతర ప్రముఖ కళాకారులతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రవచనాలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, బుర్రకథ, హరికథ తదితర కార్యక్రమాలను దేవాదాయ శాఖ చేపడుతుంది.
* కార్తీకదీపాలను వదిలేందుకు నీటి కొలనుల ఏర్పాటు
* భక్తి ఛానల్, ఎఫ్ఎం రేడియో తదితర సమాచార సాధనాల ద్వారా కార్తీక మాస దీపోత్సవ వేడుకల ప్రచారం
* అవకాశమున్నచోట ప్రత్యేక ‘నది హారతి’ కార్యక్రమాల నిర్వహణ
* టీజీ ఆర్టీసీ సహకారంతో ప్రత్యేక రవాణా సదుపాయ కల్పన
* కార్తీక మాస దీపోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా అభిషేకాలు, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి ప్రత్యేక పూజల నిర్వహణ

LEAVE A RESPONSE