ఏపీ ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు
కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సోమవారం విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సోమవారం కలిశారు. కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజలకు సత్వర సేవలను అందించడంలో కలుగుతున్న ఇబ్బందులను ఆమెకు వివరించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.