Suryaa.co.in

Andhra Pradesh

పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించే చర్యలు

-పూర్వపు ఇన్వెస్టిమెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురండి
-ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటి, ఎలక్ర్ట్రానిక్స్ కంపెనీలతోపాటు కొత్తగా రావడానికి ఆసక్తిచూపే పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల ప్రస్తుత స్థితి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై శుక్రవారం సమీక్షించారు.

రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో నూతన ఐటి పాలసీని తీసుకురానున్నామని, ఇందుకోసం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో (2019కి ముందు) ఉన్న పోర్టల్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

విశాఖపట్నంలో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. అదేవిధంగా విశాఖ, పరిసరాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపే పరిశ్రమదారులకు ఏమేరకు భూమి అందుబాటులో ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమదారులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని పరిష్కరించాలని, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో ఐటి,ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి కోన శశిధర్, జెడి (ప్రమోషన్స్) సూర్జిత్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ సిఇఓ అనిల్ కుమార్, ఎపిటా జనరల్ మేనేజర్ విజయకాంత్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE