-పార్లమెంటులోనూ అసెంబ్లీ ఫలితాలే
-13 సీట్లలో గెలుపు ధీమా
-ఐదు శాతం ఓటు బ్యాంకు పెరిగిందన్న అంచనా
-గెలుపు లెక్కలపై కాంగ్రెస్ కూడికలు తీసివేతలు
(గంటా రాంబాబు)
రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసుకుంది. అన్ని చోట్ల పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఓటర్లు తమ ప్రజాపాలనను ఆశీర్వదించారని ధీమాతో ఉంది.
ఇప్పటివరకు ఉన్న సర్వేల రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 సీట్లు పక్కాగా గెలుస్తామనే అంచనాకు వచ్చింది.
మంగళవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడి పోలింగ్ జరిగిన తీరును సమీక్షించారు.
అన్ని చోట్ల ఓటింగ్ కాంగ్రెస్ కు అనుకూలంగా జరిగిందని, వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గు చూపారని నేతలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైందని అంచనాకు వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమాతో ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.40 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే 4 నుంచి 5 శాతానికి మించి పార్టీ ఓటు బ్యాంకు తప్పకుండా పెరుగుతుందని విశ్లేషించుకున్నారు.
వివిధ సర్వేల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని అంచనాకు వచ్చింది. మిగతా నియోజకవర్గాల్లో ఫలితాలు అంచనా వేసేలా లేవని అభిప్రాయానికి వచ్చింది.
కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానానికి పోటీ పడిందని, బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీలో కనిపించలేదని తమకు అందిన సమాచారాన్ని విశ్లేషించుకున్నారు.
నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మిగతా నియోజకవర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు.