– ఆటో డ్రైవర్లకు బాకీ ఉన్న రూ. 1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్
– కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
– ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పోరాటం తప్పదు
– ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ల మహా ధర్నా
– ఆటో డ్రైవర్లకు ఆత్మీయ బరోసా కార్యక్రమంలో భాగంగా ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఆటోడ్రైవర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని, ఆటో డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్న రూ. 1,560 కోట్ల బాకీని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుంటే హైదరాబాద్‌లో మహా ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆటో అన్నలతో బిఆర్ఎస్కు ఉన్న అనుబంధం కొత్తది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, కేసీఆర్ ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్ష చేసినప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో, ఆటో డ్రైవర్లు కూడా ముందుండి పోరాడారని, తెలంగాణ కావాలే, అయి తీరాల అని ర్యాలీలు తీసి కేసీఆర్‌కు మద్దతుగా నిలబడ్డారని గుర్తుచేశారు.
వారి పాత్ర పోరాటంలో మరువలేనిదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల పట్ల తన ప్రేమను చాటుకున్నారని కేటీఆర్ తెలిపారు. కేవలం ఆటో అన్నలకే కాకుండా, రాష్ట్రంలోని సుమారు 6న్నర లక్షల నుంచి 7 లక్షల మంది ఆటో కార్మికులకు, అడగకుండానే, మ్యానిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగమాటలు చెప్పకుండానే 5 లక్షల ప్రమాద బీమాను కల్పించారని వివరించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, కేసీఆర్ రైతు బీమాను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే. అలాగేడ్రైవర్లకు, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కార్మిక పక్షపాతి కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు, అసంఘటిత రంగంలోని దాదాపు 13న్నర లక్షల మంది డ్రైవర్లకు (వ్యాన్లు, జీపులు, ట్రాక్టర్లు, టాక్సీలు, లారీలు) కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. సిరిసిల్ల జిల్లా కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమని, నేతన్నలు, కర్షకులు (రైతులు), ధార్మికులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉంటారని వివరించారు.
కాంగ్రెస్ మోసపూరిత పాలన: రెండేళ్లలో కాంగ్రెస్ వైఫల్యం
రాష్ట్రంలో మార్పు, మార్పు అంటూ జరిగిన మోసం ఎలా ఉంటుందో రెండేళ్లలో ప్రజలకు అర్థమైందని కేటీఆర్ విమర్శించారు. రైతులు, యువత, మహిళలు సహా అందరినీ 420 హామీలు ఇచ్చి మోసం చేశారని. రైతు రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతూ, దేవుళ్లపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో మంచిగా దర్జాగా బతికిన ఆటో డ్రైవర్ మష్రత్ అలీ, నేడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల వల్ల రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఆటో డ్రైవర్లకు ₹1,560 కోట్ల అప్పు
నెలకు రూ. 1,000 చొప్పున ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రెండేళ్లకు లెక్క కడితే, రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1,560 కోట్లు అప్పు పడి ఉందని స్పష్టం చేశారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కు రెండేళ్లకు రూ. 24,000 బాకీ ఉన్నారని. ఆటో డ్రైవర్లకు బీమా కల్పిస్తే, ఈ ప్రభుత్వం దాన్ని కూడా ఊడగొట్టిందని, అందుకే గతంలో 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వ హత్యే అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆటో డ్రైవర్ల డిమాండ్: పోరాటం తప్పదు
ఆటో డ్రైవర్ల హక్కుల సాధనకు తాము అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి లోపు బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మహా ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు.
“కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు. గళ్ళా పట్టి అడిగితేనే ఇస్తాడు” అని అందుకే పోరాటం తప్పదని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక క్రెడిట్ సొసైటీ (కోఆపరేటివ్ సొసైటీ) గా ఏర్పడాలని వారికి సూచించారు.