– కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తంగా మారింది
– రాహుల్ గాంధీ ఇంట్లో ముగ్గురికి ఎంపీ పదవులు ఎందుకు?
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసింది. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో జీవో నెం.46 తీసుకొచ్చి బీసీలను దగా చేస్తోంది. బీసీలకు 42 శాతం కాదు, కనీసం 20 శాతం కూడా ఇవ్వకుండా కేవలం 17 శాతం మాత్రమే కేటాయించడం… బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. కులగణన, సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్‌లు, జీవోలు అంటూ వెనుకబడిన వర్గాలను మైమరిపించి, ఆశలు రేకెత్తించి చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారు.
కులగణన సర్వే పేరిట రూ.200 కోట్లు ఖర్చు చేశారు.. ఏమైంది? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరించారు. ఆనాడు మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నవి కాబట్టే బీసీల ఓట్ల కోసం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ప్రేరేపిస్తే, తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ల పేరిట హడావుడిగా, ఆశాస్త్రీయంగా సర్వేలు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో బీసీలపట్ల కాంగ్రెస్ మోసపూరిత చర్యలకు ప్రభావితం కాకుండా, అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారు. తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ మాటలు నమ్మి.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తారని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. రేవంత్ గౌడ్ అన్నరు, రేవంత్ యాదవ్ అన్నరు, రేవంత్ ముదిరాజ్ అన్నరు.
ఇప్పుడు ఏమైంది? బీసీలను కాంగ్రెస్ దోఖా చేసింది. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి నమ్మించి, ఈరోజు నట్టేట్లో ముంచింది. రెండు సంవత్సరాల పాలన తర్వాత ఆ హామీని మోసపరిచి రిజర్వేషన్లు కేవలం 17%కి తగ్గించింది. మోసానికి ఒక రూపం ఉంటే అది కాంగ్రెస్ పార్టీయే. నెహ్రూ కుటుంబం నుంచి మొదలు కాంగ్రెస్ ఇప్పటివరకు బీసీలను అడుగడుగునా మోసం చేస్తూనే వచ్చింది. ఆనాడు బీసీల రిజర్వేషన్ల విషయంలో కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ నివేదికలను పట్టించుకోకుండా అడ్డుపడింది. కాకా కలేల్కర్ కమిషన్ కులగణన చేపట్టి బీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు, అప్పటి ప్రధాని నెహ్రూ కులాల పేరుమీద రిజర్వేషన్లు వీలులేవని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. బీసీల సంక్షేమం, న్యాయం కాంగ్రెస్ ఆలోచనలో లేదు. నెహ్రూ కుటుంబమే ప్రధానంగా వారి ఆలోచన. బిహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ అక్కడి ప్రజలు వాటిని నమ్మలేదు, కాంగ్రెస్‌ను తిరస్కరించారు.
ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. మొదట కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బురిడీ కొట్టించి, ఆ తర్వాత ఆశలు రేపి చివరికి కాంగ్రెస్ నయవంచన చేసింది. రాజ్యాంగ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆంక్షలు, అమల్లో ఉన్న చట్టాలు అన్నీ పరిగణనలోకి తీసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల లబ్ధి కోసం కాంగ్రెస్ అలవికాని హామీలను గుప్పించింది. ఇవాళ కేంద్రం నుంచి వచ్చే కేవలం రూ.2,300 కోట్ల నిధుల కోసం మాత్రమే స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యారు.
కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ నడుస్తున్నప్పటికీ ఎన్నికలు హడావుడిగా నిర్వహిస్తున్నారు. ఎన్టీ రామారావు హయాంలో 1988లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే… ఇవాళ వాటిని కేవలం 17 శాతానికి తగ్గించారు. పార్టీ పరంగా కాంగ్రెస్ అభ్యర్థులకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం అంటే ఎవరిని మభ్యపెడుతున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా సింబల్స్ ఉండవు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసిన కామారెడ్డి BC డిక్లరేషన్‌లో 42% రిజర్వేషన్లు హామీ ఇచ్చి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 17%కి మాత్రమే పరిమితం చేశారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న కపట మోసం. రాష్ట్రంలో 12,733 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2019లో BCలకు 2,404 (23%) రిజర్వ్ అయ్యాయి. 2025లో కేవలం 2,176 మాత్రమే — 228 గ్రామాలు తగ్గిన పరిస్థితి. మొత్తం BC రిజర్వేషన్లు 17%. మాత్రమే.
జిల్లాల వారీ పరిస్థితి: ములుగు, మహబూబాబాద్: 3% ఆదిలాబాద్: 4% ఆసిఫాబాద్: 5% మంచిర్యాల: 7% ఖమ్మం: 9% వికారాబాద్: 18% కామారెడ్డి: 23% (గతంతో పోలిస్తే 8 గ్రామాలు తక్కువ) భద్రాద్రి కొత్తగూడెం: 0% రాష్ట్రంలోని 27 మండలాల్లో BCలకు ఒక్క స్థానం కూడా లేదు. కొన్ని జిల్లాల్లో BC రిజర్వేషన్లు 10% కన్నా తక్కువ. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 30% మించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ మిగిలిన 20% బీసీలకు ఇవ్వాల్సింది పోయి కేవలం 10%కి కుదించారు. దేశంలో బీసీలకు మోదీ ప్రభుత్వం విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో న్యాయం చేస్తోంది. బిహార్ లో బీసీ ముఖ్యమంత్రి, ఈబీసీ డిప్యూటీ సీఎం చేశారు. అనేక రాష్ట్రాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేస్తున్నది కాంగ్రెస్. జనాభా నిష్పత్తికి న్యాయం జరగాలంటే… కాంగ్రెస్ చేయలేనిది, ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు 2026లో కులగణనతో జనగణన నిర్వహించడం ద్వారా చేస్తున్నారు. ఇది చరిత్రాత్మక, సాహసోపేత నిర్ణయం. గత 55 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పని. “ఎంత జనాభా ఉంటే అంత వాటా” అంటున్న కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఇంట్లో ముగ్గురికి ఎంపీ పదవులు ఎందుకు? బీసీలకు న్యాయం చేయలేదే? అందుకే అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టాలని కోరుతున్నాను.