– మీలా 30 శాతం కమీషన్లు తీసుకోవడం రాకనే నేను అన్ ఫిట్ అయ్యాను.. భట్టి నోరు అదుపులో పెట్టుకోండి
– విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనం.. కాంగ్రెస్ తెచ్చింది ప్రజా పాలన కాదు, ఆంధ్రా ద్రోహుల పాలన
– గ్రీన్ ఎనర్జీ పేరుతో రూ. 600 కోట్లు వసూలు.. మెగావాట్ కు రూ. 30 లక్షల లంచం ఇవ్వలేదని ఫైళ్లు తొక్కిపెట్టిన కాంగ్రెస్ సర్కార్
– మైనింగ్ ఇంజనీర్లకు విద్యుత్ శాఖలో పెత్తనమా?
– అర్హత లేని ఆంధ్రా అధికారుల కోసం తెలంగాణ బిడ్డలను బలిచేస్తారా?
– మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కడుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50 వేల కోట్ల రూపాయల స్కాం ఉందని బీఆర్ఎస్ బయటపెట్టింది. అయితే ఈ విషయంపై భట్టి విక్రమార్క , శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. తమ స్థాయిని దించుకొని, నేను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని భట్టి విక్రమార్క నన్ను విమర్శించారు. ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలాగా 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు, అందుకే అందులో నేను అన్ఫిట్.ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఏ రోజు కూడా సెక్రటేరియట్ లోపలికి వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలోనే లేదు.
మన ఊరు – మన బడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ఇంతకుముందు ఎప్పుడైనా ధర్నా చేశారా? సర్పంచులు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి అరెస్ట్ అయిన చరిత్ర ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్ అన్ ఫిటా? లేదంటే నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ అన్ఫిటా? జనాభా పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, అవసరాలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. రామగుండం, మక్తల్, పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కడతామని. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు చెప్పారు.మేము ప్రశ్నించేసరికి మక్తల్ లో పెట్టడం లేదు అని రెండు రోజుల్లోనే మాట మార్చారు.
ఇంకా టెండర్లు పిలువలేదు, పనులే మొదలు కాలేదు, 50 వేల కోట్ల అవినీతి అని ఎలా అంటారని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. మరి కాళేశ్వరంలో 84 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇదే మంత్రులు, నాయకులు మమ్మల్ని ఎలా తప్పుపట్టారు? రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు గల్లీ గల్లీకి పోయి చెప్పారు కదా? ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు మీరు క్షమాపణ చెప్పాలి. ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండానే, ఎలాంటి అప్పు చేయకుండానే, వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండానే.. మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంటు ఇస్తుంటే, మళ్లీ ఈ అప్పులు, పెట్టుబడులు, ధరలు ఎక్కువ పెట్టి కరెంటు కొనడం ఎందుకని మేము సూటిగా ప్రశ్నిస్తే సమాధానం ఇప్పటిదాకా చెప్పడం లేదు. . అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యూనిట్ 4 రూపాయలకు, ఐదు రూపాయలకు బయట దొరుకుతుంది అన్నారు.
తాము గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తామని చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగం పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శ్వేత పత్రంలో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 60 శాతం ఉంది, 2026 నాటికి 40 శాతానికి తగ్గించుకుంటామని చెప్పింది. అసెంబ్లీలోనేమో థర్మల్ విద్యుత్ ను తగ్గిస్తామంటారు, మరోవైపు ఏమో కమిషన్ల కోసం ప్లాంట్లను నిర్మించడానికి రెడీ అవుతారు. గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ, కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ లో 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఆ గ్రీన్ ఎనర్జీ నినాదం ఇచ్చిన వాళ్ళే మళ్ళీ థర్మల్ ఎనర్జీకి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఎన్టీపీసీ దగ్గర 800 మెగావాట్లకు ఈఆర్సీ (ERC) ధర నిర్ణయించింది. యూనిట్ కి నాలుగు రూపాయల 12 పైసలు. జెన్కో డిపిఆర్ ప్రకారం రామగుండం పవర్ ప్లాంట్ నిర్మాణానికి పదివేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుంది ఒక్క మెగావాటుకు 13 కోట్ల 62 లక్షలు ఖర్చు అవుతుంది.
నిర్మాణం పూర్తయ్యేసరికి 15-16 కోట్లకు చేరుతుంది. ఆ ప్లాంట్ లో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ₹7.70 పైసలు అవుతుందని జెన్కో డిపిఆర్ స్పష్టం చేసింది.ఇది నిజమా కాదా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పాలి. నిర్మాణానికి 15,000 కోట్లు అవుతుంటే.. ఇందులో 25 శాతం జెన్కో/రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టాలి, 75% అప్పులు తేవాలి. ఇట్లా మూడు పవర్ ప్లాంట్లకి 45 వేల కోట్ల రూపాయలు కావాలి. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి’ లెక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో విద్యుత్ రెడీగా ఉంది. మనం అప్పు చేయాల్సిన అవసరం లేదు, మిత్తి మీదేసుకోవాల్సిన పనిలేదు. వాళ్లు ఇచ్చే కరెంటుకు యూనిట్ కి నాలుగు రూపాయల 12 పైసలు మాత్రమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే థర్మల్ పవర్ ప్లాంట్ లో ఒక యూనిట్ కి ఏడు రూపాయల 70 పైసలు అవుతుంది. అంటే దాదాపు మూడు రూపాయలు ఎక్కువ. 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ లో రోజుకు మూడు కోట్ల యూనిట్ల ఉత్పత్తి జరుగుతుంది.అంటే అదనంగా 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
సంవత్సరానికి 3,285 కోట్లు, పవర్ ప్లాంట్ల అగ్రిమెంటు 25 సంవత్సరాలు అంటే.. 25 సంవత్సరాలకు 82,000 కోట్ల రూపాయల అదనపు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. మీ 30%, 40% కమిషన్ల కోసం ఈ రాష్ట్ర ప్రజల మీద ఎందుకు భారం వేస్తారని భట్టి విక్రమార్క గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక దిక్కు పైసలు లేవు, అప్పుల కోసం పోతే చెప్పులు దొంగతనానికి వచ్చినట్టు చూస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్తుంటాడు. పెన్షన్లకు దిక్కులేదు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం లేదు. మరి ఈ ప్లాంట్లు కట్టడానికి అప్పులు ఎక్కడినుంచి తెస్తావు? మిత్తిలు ఎలా కడతారు? ఇవేమీ లేకుండా సగం ధరకే కరెంటు ఇస్తానంటే ఎన్టీపీసీ ని ఎందుకు వద్దంటున్నావు? కమిషన్లు రావని ఎన్టీపీసీ కరెంట్ ను కొనడం లేదా? ఏడాదిలో రెడీగా కరెంటు వచ్చే ఎన్టీపీసీ వద్దంటున్నావు, ఐదేళ్ల తర్వాత వచ్చే కరంటుకు ఒప్పుకుంటున్నావ్. నువ్వు చేసే తప్పుల వల్ల ఈ రాష్ట్ర ప్రజల మీద 82 వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. రేపు కరెంట్ బిల్లులు పెరుగుతాయి కదా? ఇది ప్రజలకి ఆర్థిక భారం కదా? అందుకే ఈ స్కాం ను ప్రజల పక్షాన బయట పెట్టింది బీఆర్ఎస్. బొగ్గు లేని దగ్గర పవర్ స్టేషన్ ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ.
ఏం బొగ్గు ఉందని విజయవాడలో, రాయలసీమలో, కృష్ణపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్ ను కాంగ్రెస్ పార్టీ కట్టింది? మాట్లాడేటప్పుడు మీరు గత చరిత్ర చూసుకొని మాట్లాడండి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఒకే దగ్గర ఉంటే సమస్య అవుతుంది. అంతేకాదు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఫ్లై యాష్ చాలా పెద్ద సమస్య. ఆ ఫ్లై యాష్ ని ఎవరూ తీసుకోకపోతే పర్యావరణానికి చాలా ముప్పు ఉంటుంది. దామరచర్ల దగ్గర చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్లు ఆ ఫ్లై యాష్ తీసుకుంటామని చెప్పారు. అక్కడ కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది. అందుకే అక్కడ పెట్టాము. ఇవన్నీ ఆలోచించే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను కట్టాం. యాదాద్రి పవర్ ప్లాంట్ ను మూసేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగిరిండు. ఇప్పుడేమో కొత్త పవర్ ప్లాంట్ కు చప్పట్లు కొడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెదాలు మూతపడతాయా? ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అర్థమవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంది.
గ్రీన్ పాలసీ గాలికి పోయి, కమిషన్ల కోసం థర్మల్ పాలసీ వచ్చింది. ఇవాళ విద్యుత్ శాఖను ఆంధ్ర అధికారులతో నింపిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ వాళ్ళు ఉండాలని ఉద్యమం జరిగింది. కేసీఆర్ 95% లోకల్ రిజర్వేషన్లను ఉద్యోగాల్లో సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టుల్లో ఆంధ్ర అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుపుతున్న అనుమానం కలుగుతుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను అత్యంత కీలకమైన విభాగాల్లో వరుసగా నియమించారు. జెన్ కో డైరెక్టర్ గా ఎంతోమంది అనుభవం ఉన్న తెలంగాణ బిడ్డలు ఉండగా.. హైడల్, థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తీసుకోవాలి. కానీ వీళ్లు సింగరేణిలో పనిచేసిన రాజశేఖర్ రెడ్డి అనే ఆంధ్ర వ్యక్తిని తెలంగాణ జెన్కో ప్రాజెక్టు డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. ఆయన ఎప్పుడూ విద్యుత్ విభాగంలో పనిచేయలేదు, సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనను తీసుకొచ్చి కీలకమైన హైడల్ అండ్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి డైరెక్టర్ గా వేశారు. ఇది తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లను, ఉద్యోగులను అవమానించినట్టే.
ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులను అవహేళన చేసిన పచ్చి సమైక్యవాది కుమార్ రాజాను తీసుకొచ్చి విద్యుత్ ఉద్యోగుల డైరెక్టర్ గా జెన్కోలో పెట్టారు. ఇది ఉద్యమకారులను, ఉద్యోగులను అవమాన పరిచినట్లు కాదా? తెలంగాణ ద్రోహిని తీసుకొచ్చి తెలంగాణలో ఉద్యోగం ఇస్తారా? ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన ‘రైఫిల్ రెడ్డి’ రేవంత్ రెడ్డి.. ఆయన గురువు చంద్రబాబు తెలంగాణ ద్రోహి. అందుకే నియామకాలన్నీ తెలంగాణ ద్రోహులకే అవుతున్నాయి. ఇది ప్రజా పాలన కాదు, తెలంగాణ ద్రోహుల పాలన. మధ్యప్రదేశ్ లో మైనింగ్ ఇంజనీర్ గా పనిచేసిన శివాజీ అనే వ్యక్తిని ఎస్పీడీసీఎల్ (SPDCL) లో కీలకమైన ప్రాజెక్ట్ అండ్ హెచ్ఆర్డి కి డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. విద్యుత్ మీద ఇతనికి కనీసం అవగాహన లేదు, అతన్ని తీసుకొచ్చి డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. తెలంగాణలో సమర్థులైన దళిత అధికారులు ఉన్నారు. చీఫ్ ఇంజనీర్లుగా రిటైర్ అయిన తెలంగాణ దళిత బిడ్డలు, అనుభవం ఉన్న అధికారులు ఉంటే.. వాళ్ళందర్నీ పక్కనపెట్టి, నరసింహులు అనే ఏనాడు తెలంగాణ గడ్డమీద పనిచేయని, ఇక్కడి విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన లేని వ్యక్తిని ఆంధ్రా నుంచి తీసుకువచ్చి ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ పోస్టులో పెట్టారు.
ఎవరు చెప్తే పెట్టారు? ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని లేదా అనుభవం ఉన్న టెక్నోక్రాట్ ని రెడ్కో సీఎండీ (CMD) గా పెట్టింది. ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి చెందిన జూనియర్ మోస్ట్ అధికారి, డివిజనల్ ఇంజనీర్ పనిచేసిన వావిలాల అనిల ని తీసుకొచ్చి సీఎండీ గా నియమించారు. జూనియర్ మోస్ట్ డివిజనల్ ఇంజనీర్ ని తీసుకొచ్చి రెడ్కో సీఎండీ గా పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. తెలంగాణ అధికారులు, ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు, తాము కీలకమైన పదవులకు పనికిరామా అని ప్రశ్నిస్తున్నారు. విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న, గతంలో ఏసీబీ కేసుల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన నందకుమార్ ని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పదవిలో నియమించారు. అత్యంత కీలకమైన పోస్ట్ ఇది. ఇతని మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, పోస్టింగ్ లకు ట్రాన్స్ఫర్ లకు పైసలు తీసుకుంటారని మీడియాలో చాలా వార్తలు వచ్చాయి .
ఆ పదవికి ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా దొరకడం లేదా? అవినీతి మరక ఉన్న ఆంధ్ర ప్రాంత వ్యక్తే దొరికాడా? గ్రీన్ ఎనర్జీ పాలసీ లో పారిశ్రామికవేత్తలకు ఎక్కడి నుంచైనా గ్రీన్ ఎనర్జీ తీసుకొని వాడుకోవచ్చు అని అప్లికేషన్లు తీసుకున్నారు. 25 వేల రూపాయలు కట్టి అప్లికేషన్ తీసుకోమన్నారు. అప్లికేషన్ల మీద 600 కోట్లు వచ్చాయి. కానీ ఈ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, మెగావాట్ కి 20 లక్షల లంచం అడుగుతున్నట్టు.. పైన కూడా ఇవ్వాలి, ఇంకో పది లక్షలు కలిపి 30 లక్షలు ఇవ్వమంటున్నారు. బేరం కుదరక ఒక్క మెగావాట్ కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు 25 వేల ఫీస్ తో దరఖాస్తు ఎందుకు తీసుకున్నారు? ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఎందుకు పెట్టారు? వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.
అవగాహన లేమితో, ఆంధ్ర అధికారులతో, దోపిడీతో ఆగమాగం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఆంధ్ర విద్యుత్ అధికారులు అందరినీ తొలగించండి, తెలంగాణ అధికారులకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ – నారాయణపేట లిఫ్ట్ కు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? గ్రామాలకే కదా? ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ఆ పనికి ఎన్నికల కోడ్ కు ఎందుకు వర్తించదు? శంకుస్థాపన చేస్తున్న రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గ్రామాల నుంచి వెళ్లేటివే. రెండేళ్ల నుంచి ఏం చేశారు? ఎన్నికలకు ముందే గుర్తుకొచ్చాయా? తక్షణమే ఎన్నికల సంఘం రివ్యూ చేసి, పోలీసులకు ఆదేశాలిచ్చి కేసు నమోదు చేయాలి.రాష్ట్ర ఎన్నికల సంఘం చట్ట పరంగా వ్యవహరించాలని టిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.

