– కృష్ణానది ఎగువన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించింది
– ఈ దేశంలో రాష్ట్రంలో చేపట్టిన అనేక సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించి పూర్తి అయ్యాయి
– కృష్ణా నది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నీటిని తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ నదిపై ప్రాజెక్టులను వేగంగా పూర్తి
– నీటిపారుదల, వ్యవసాయరంగం అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది
– పాలేరు రిజర్వాయర్ లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
పాలేరు: సాగర్ ఎడమ కాలువ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉంటే శ్రీశైలం పైన రోజుకు 11 టిఎంసిలు విడుదల చేసుకునేందుకు ఆనాటి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోకపోగా సహకరించడం మూలంగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
సోమవారం ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ యూటీ పనులు పూర్తిచేసి పంట పొలాల్లోకి నీళ్లు వదిలే కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొని అనంతరం స్థానికంగా మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశ, రాష్ట్ర భవిష్యత్తు గురించి దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం మూలంగానే ప్రజలకు ఈనాడు సమృద్ధిగా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అని తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తర్వాత ధనిక రాష్ట్రంగా బీఆర్ఎస్ కు అప్పగిస్తే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఈ ప్రాంత ప్రజలకు భారంగా మారేలా బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని తిరిగి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలు కృష్ణ గోదావరిపై తెలంగాణ రాష్ట్రానికి రావలసిన వాటా నీళ్ళు, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
టిఆర్ఎస్ చేసిన తప్పిదాల మూలంగా జూరాల శ్రీశైలం మధ్యలో రాయలసీమ లిఫ్ట్ కట్టడం మూలంగా సాగర్ ఎడమ కాలువలోని రెండో జోన్ పరిధిలోకి వచ్చే ఖమ్మం జిల్లాకు పెద్ద ఎత్తున ఇబ్బంది ఏర్పడింది, మొదటి జోన్ లోని నల్లగొండ జిల్లాకు కొంత మేరకు ఇబ్బంది ఏర్పడిందని డిప్యూటీ సీఎం వివరించారు.
ఎగువన ఏపీ ప్రభుత్వం నీటిని తరలించకపోతున్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మీడియా సంస్థలకు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రం మొత్తానికి ఆనాడు వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.
ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా భావించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు.
ఆ తప్పిదాలను సరి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరించిన హరీష్, ఆనాటి ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించిన కేటీఆర్, అన్నిటికీ కేంద్రమైన నాటి సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు గమనించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.
కృష్ణానది నుంచి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ నీటిని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ తో పాటు కొత్తగా చేపట్టిన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని తెలిపారు.
గత వానాకాలంలో పెద్ద ఎత్తున వచ్చిన వరదలతో దెబ్బతిన్న సాగర్ ఎడమ కాలువ పైపులు మరమ్మతు చేసి యుద్ధ ప్రాతిపదికన నీటిని అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే బహుళార్థక సాధక ప్రాజెక్టులు, వ్యవసాయం, కరెంటు అని తెలిపారు.
రాష్ట్రంలో 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు.
ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా, విత్తన భాండాగారంగా మారుస్తున్నామని, నీటిపారుదల, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు నీళ్లు వదిలి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలు తమకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.