October 8, 2026

500 కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలవలేరు

  • మూడేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సంపాదన 50 వేల కోట్లు
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా మేధావి రాకేష్ రెడ్డిని గెలిపిద్దాం
  • బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడేళ్ల పాలనలో అక్రమంగా 50 వేల కోట్ల రూపాయలు సంపాదించారని, ప్రజల సొమ్మును కుటుంబ సభ్యుల ఖాతాలకు పంపుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిచారు.

నల్గొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నల్గొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అక్రమంగా 50 వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

గత మూడేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి పేరు మీద గీతా హ్యూండయ్ షో రూం లు ప్రారంభించారన్నారు. గతంలో కేసిఆర్ ఎస్సీ పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కార్లలో తిరగాలని దళిత బంధు పథకాన్ని అమలు చేసి పేదలకు సహాయం చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం సతీమణి పేరు మీద కార్ల షో రూం పెట్టుకున్నారని విమర్శించారు.

గత ముఖ్యమంత్రి కేసిఆర్ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ పేద వర్గాల కోసం వెయ్యి గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తే, రేవంత్ రెడ్డి తన కూతురు పేరు మీద ప్రైవేట్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. మైండ్ వాల్ట్ పేరు మీద హైదరాబాద్ చుట్టు పక్కల ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

గత ప్రభుత్వం పేదల కోసం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు మరియు ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు హాజరై, ప్రమోట్ చేసి, చివరకు 3200 కోట్లకు అమ్మారని గుర్తు చేశారు. ఈ హాస్పిటల్ డైరెక్టర్ గా రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఉన్నారని స్పష్టం చేశారు.

ఈ విధంగా రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 50 వేల కోట్లలో 500 కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలువరన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు బాకీ పడ్డారని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మోసం చేశారని ధ్వజమెత్తారు.ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారన్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిసి నల్గొండ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వకుండా, కోమటి రెడ్డి పృథ్వీ రెడ్డికి ఇచ్చారని, కమీషన్ల కోసం భట్టి, వెంకట్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టికి కమీషన్లు కట్టలేక,ఇంట్లో చిట్టీలు కట్టలేక, పదవి నుండి దిగిపోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి కమీషన్ల రూపంలో సంపాదించిన సంపాదించిన నల్ల ధనాన్ని, తెల్ల ధనంగా మార్చు కావడానికి,కుటుంబ సభ్యుల పేరు మీద కంపెనీలు, పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన,మరియు దోపిడీ గురించి ప్రశ్నిస్తే బిఆర్ఎస్ నాయకులను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు.

నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటరు రిజిస్ట్రేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ప్రతి రెండు రోజులకోసారి కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసుకొని, ఎప్పటికప్పుడు ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటినుండి ఓట్ల లెక్కింపు వరకు నల్గొండ ప్రధమ స్థానంలో ఉండాలన్నారు.

అందుకే ఇలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని ,కమీషన్ల ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓడించడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్స్ లాంటివన్నారు. ఇందులో గెలిచి సెమీ ఫైనల్స్,ఫైనల్స్ చేరుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం గ్రాడ్యుయేట్లు అందరూ వెంటనే ఓటు రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు నమోదు చేసుకుంటే మన అభ్యర్థి గెలుపు ఖాయమైనట్టేనన్నారు.గతంలో ఏనుగుల రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీగా తృటిలో ఓడిపోయారని, ఈ సారి ఖచ్చితంగా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదివి,ఇటీవల విద్యార్థి,నిరుద్యోగ,ఉద్యోగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని,అలాంటి మేధావికి అవకాశం ఇస్తే, మన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని,అందుకే రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు , మాజీ చైర్మెన్లు, కార్యకర్తలు,పట్టభద్రులు హాజరయ్యారు.

Total Visitors: 2,899,809