– పార్టీ శ్రేణులకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామ్ చందర్ రావు పిలుపు
హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు అధ్యక్షతన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ సమావేశం జరిగింది. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రామ్ చందర్ రావు కమిటీ సభ్యులకు సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతంరావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి పాల్గొన్నారు.