– దళిత క్రైస్తవ నేత రాకేష్ క్రిస్టోఫర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
* దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ కు మద్దతిచ్చిన దళిత క్రైస్తవులు ఎందుకు స్పందించడం లేదు.
* రాకేష్ క్రిస్టోఫర్ మీద దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలి
* కావాలనే కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవుల పట్ల చిన్నచూపు
* దళిత క్రైస్తవుల మీద దాడి జరిగితే సహించేది లేదు
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దళిత క్రైస్తవ నాయకులు, జూబ్లిహిల్స్ క్రిస్టియన్ ఫోరం ఉపాధ్యక్షులు రాకేష్ క్రిస్టోఫర్పై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అణగారిన వర్గాలపై పెత్తనం చూపే కాంగ్రెస్ నిజ స్వరూపం ఈ ఘటన ద్వారా మరోసారి బయటపడిందన్నారు. దళిత క్రైస్తవులపై దాడులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన దళిత క్రైస్తవ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ దాడులు చేస్తుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. ఇది కేవలం రాకేష్ క్రిస్టోఫర్ మీద మాత్రమే జరిగిన దాడి కాదని యావత్ సమాజం మీద జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇది కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవుల పట్ల ఎలాంటి దృష్టితో వ్యవహరిస్తోందో స్పష్టంగా చూపుతోందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే దళిత క్రైస్తవుల పట్ల ప్రేమ చూపించి, తరువాత ఇలాంటి దౌర్జన్యాలకు దిగడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
ప్రజా మద్దతు లేకపోవడంతో ప్రజల గళం మూయించడానికి దొంగ ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఈ విధమైన దాడులకు ఉసిగొల్పుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్లో దళిత క్రైస్తవ ఓటర్లను భయపెట్టాలని కాంగ్రెస్ చేసిన కుట్ర అన్నారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన దళిత క్రైస్తవ నాయకులు స్పందించకపోవడం, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం, ఈ చర్యలను కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా సమర్థిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. రాకేష్ క్రిస్టోఫర్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మళ్లీ దళిత క్రైస్తవ సమాజంపై దాడులు జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.