– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎక్కడికక్కడే అబద్ధాలను ప్రచారం చేస్తూ లబ్ధి పొందడమే పనిగా పెట్టుకుందని, స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కుటుంబం మాత్రమే పోరాటం చేసిందని అసత్యపు ప్రచారాలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాహుల్ కుటుంబం… గాంధీ వారసులు కాకపోయినా, రాజకీయ అవసరాల కోసం గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వారి అనుచర బృందం బీజేపీకి వ్యతిరేకంగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేశారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనంటూ అసత్య ప్రచారాన్ని చేసి బీజేపీని వెనక్కినెట్టే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కుంభకోణాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేసింది బీజేపీ మాత్రమే. అయితే, అబద్ధపు ప్రచారంతో కాంగ్రెస్ కుట్ర చేసి లబ్ధి పొందింది.
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం లేదని, అందుకు లోపాయికార ఒప్పందమే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలు ప్రకటించి, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.. 8 నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. రూ. 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి, సగం మంది రైతులకు కూడా చేయకుండా మోసం చేశారు. రైతు రుణాల మాఫీకి రూ. 79 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం కాగా, కేవలం రూ. 17,900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంది.
రైతులకు అనేక హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని భావించి, రేవంత్ రెడ్డి బీజేపీపై భయంకరంగా దుష్ప్రచారం చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు. ఎన్నికల ప్రచారం సాకుతో అడ్డగోలు మాటలతో, తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను న్యాయపరంగా ఎదుర్కొంటాం.