Suryaa.co.in

Editorial

ఇదేం పరామర్శ రాజకీయం?

– దేశభక్తికి మారుతున్న ప్రాతిపదిక
– విధ్వంసాన్ని కాంగ్రెస్‌ సమర్ధించినట్లేనా?
– రేవంత్‌ పరామర్శపై విమర్శల వెల్లువ
– పొలిటికల్‌ మైలేజీ కోసం కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ పోటాపోటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఈమధ్య దేశభక్తికి అర్ధాలు మారుతున్నాయి. ఒకప్పుడు దేశం కోసం పోరాడిన వారిని స్వాతంత్య్ర సమరయోధులని పిలుచుకునేవాళ్లం. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులకు పరమవీరచక్ర అవార్డులిస్తున్నాం. కానీ.. ఇప్పుడు కాలం మాదిరిగానే, దేశభక్తి ప్రాతిపదిక కూడా మారిపోయింది. జాతి సంపద తగులబెట్టిన వారి భుజం తట్టి, మేమున్నామంటూ ధైర్యం చెప్పే దేశభక్తులొచ్చేశారు. వారి మృతదేహంపై పార్టీ జెండాలు కప్పి, మంత్రులే భౌతికకాయం మోసే దేశభక్తులొచ్చారు. ‘మీరు ప్రభుత్వ ఆస్తులను ఎన్ని తగులబెట్టినా మీకేం కాదు. మిమ్మల్ని జైలు నుంచి విడిపించేందుకు మా లాయర్లు మీకోసం పనిచేస్తారని’ ధైర్యం చెప్పే దేశభక్త రాజకీయ నాయకులొచ్చారు.

అగ్నిపథ్‌ అంశంలో విధ్వంసకారులకు దన్నుగా నిలిచి, దాని ద్వారా వచ్చే పొలిటికల్‌ మైలేజీ కోసం ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ మొదలయింది. అందులో అధికార టీఆర్‌ఎస్‌ ఒక అడుగు ముందుకేసి.. మృతి చెందిన ఆందోళనకారుడి భౌతికకాయంపై పార్టీ జెండా ఉంచి, మంత్రులే పాడె మోశారు. ఆ సందర్భంగా జరిగిన ర్యాలీలో యువకులు రెచ్చిపోయి కేంద్రానికి చెందిన ఆస్తులనుrailway తగులబెట్టినా పోలీసులు మౌనపాత్ర పోషించిన వైనం విమర్శలకు దారితీసింది. ఇటు కాంగ్రెస్‌ నాయకులు ఇంకో అడుగు ముందుకేసి.. చంచల్‌గూడ జైల్లో ఉన్న విధ్వంసకారులను పరామర్శించి, న్యాయసాయం చేస్తామని భరోసా ఇచ్చిన వైనానికి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కిష్కింధకాండ కేంద్రబిందువయింది.

అగ్నిపథ్‌ నిలిపివేయాలంటూ సైనిక శిక్షణ పొందుతున్న అభ్యర్ధులు సికింద్రాబాద్‌లో చేసిన కిష్కింధకాండ విలువ కోట్ల రూపాయలు. బూడిదయింది జాతి సంపద. దేశాన్ని రక్షించే బాధ్యత మోయవలసిన ఒక సిపాయి, తానే అగ్గిపెట్టె తెచ్చి రైళ్లను తాపీగా కాల్చిన వీడియోలు యావద్దేశం చూసింది. పైగా సదరు

దేశభక్తుడు.. రైలు బోగీ కాల్చే లోకోత్తర దృశ్యాన్ని తనంతటతానే వీడియో తీసుకోవడం మరీ తెంపరితనం. అలా బోగీలను కాల్చుకుంటూ వెళ్లి, అద్దాలను కర్రలతో వసరగా కొట్టుకుంటూ వెళ్లిన కాబోయే సిపాయిల

కిష్కింధకాండను చూసిన జనాలకు.. వీరా దేశాన్ని కాపాడేదన్న సందేహం రాక తప్పదు. ఆ వీడియోలను చూసిన కొన్ని కోట్లమందికి, ఈపాటికే అలాంటి అనుమానం వచ్చింది కూడా.

warangalఆ తర్వాత విచారణ బృందాలు రంగంలోకి దిగి, ఈ కిష్కింధకాండ అంతా ముందస్తు వ్యూహం ప్రకారమే జరిగిందని తేల్చాయి. వాటి వెనుక ఎవరెవరున్నారనేది సీసీటీవీ ఫుటేజీలు చూసి కనిపెట్టి, వారిపై కేసులు కడితే, కోర్టు వారిని జైలుకి పంపించింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కాబోయే సిపాయిలు చేసిన అరాచకకాండను, ఇప్పటిదాకా ఏ ఒక్క రాజకీయ పార్టీ ఖండించకపోగా, బోగీలకు మంటపెట్టిన వారిని అమాయకులంటూ బీజేపీ సహా అన్ని పార్టీలో తీర్పులివ్వడమే ఆశ్చర్యం.

ప్రజల ఆస్తిని బూడిదపాలు చేసిన సదరు దేశభక్తులను, తాజాగా మరో దేశభక్తుడయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో కలసి పరామర్శించారు. ‘మీకేం భయం లేదు, కాంగ్రెస్‌పార్టీ మీకు అండగా ఉంటుంది. మా లాయర్లు అన్నీ చూసుకుంటారు’ అని భరోసా ఇచ్చారు. అమాయకులపై అన్నేసి

కేసులు బనాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. బోగీలకు మంటపెట్టి, పోలీసులపై రాళ్లు రువ్విన వారంతా దేశభక్తులేనన్నది రేవంత్‌రెడ్డి ఇచ్చిన తీర్పు. అంటే.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో బోగీలు తగులబెట్టి, పోలీసులపై రాళ్ల దాడి చేసిన ఘటనను కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించిందే తప్ప ఖండించలేదన్నమాట. బహుశా.. అది కాంగ్రెస్‌పార్టీ విధానం అని కావచ్చేమో?

రైలు తగులబెట్టిన విధ్వంసకారులను రేవంత్‌రెడ్డి జైలుకువెళ్లి మరీ పరామర్శించడంపై ఇప్పుడు వివాదం తెరపైకి వచ్చింది. గతంలో వైఎస్‌ విపక్షనేతగా ఉన్నప్పుడు హత్య కేసులో శిక్ష పడిన కాంగ్రెస్‌ నేత గౌరు వెంకటరెడ్డిని పరామర్శిచడం పెను వివాదంగా మారింది. తెలుగుదేశం పార్టీ దానిని వివాదంగా మార్చింది. ఒక ప్రతిపక్షనేత జైలుకు వెళ్లి హంతకుడిని పరామర్శించడమేమిటని ప్రశ్నించింది. గత మూడేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, జైళ్లలో ఉన్న తమ నేతలను కలసి పరామర్శించారు. సరే. అవన్నీ వ్యక్తిగత కేసులు కాబట్టి ఆ చర్చను కాసేపు పక్కనపెడదాం.

ఇప్పుడు రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లి పరామర్శించింది హత్య కేసులున్న వారిని కాదు. ప్రభుత్వ ఆస్తిని బూడిదపాలు చేసిన విధ్వంసకారులను! రేవంత్‌రెడ్డి చేసింది సబబే అయితే.. మన దేశాన్ని విధ్వంసం చేసే యత్నంలో భాగంగా అరెస్టయి, జైళ్లలో ఉన్న పాకిస్తాన్‌ తీవ్రవాదులనూ అలాగే పరామర్శిస్తారా? కశ్మీర్‌లో సైన్యంపై రాళ్లేస్తూ జైలుపాలయిన యువకులనూ అలాగే పరామర్శిస్తారా? మరి రాళ్లేసేఆ యువకులు కూడా.. సికింద్రాబాద్‌ ఘటనలో జైలుపాలయిన సైనిక శిక్షణ పొందిన యువకుల మాదిరిగా అమాయకులే. వారయినా.. వీరయినా ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న వారే కదా? కాకపోతే సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రమేయం ఉన్న వాళ్లు స్వదేశీయులయితే.. అక్కడ విదేశీయులు. చేసింది మాత్రం విధ్వంసమే. నేరం తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. భారతీయ శిక్షాస్మృతి అందరికీ ఒక్కటే.

అమాయకులపై అన్నేసి కేసులు బనాయించడం అన్యాయమన్న రేవంత్‌ ఆక్రోశమే ఆశ్చర్యం. చేసింది విధ్వంసమయినప్పుడు కేసులు, సెక్షన్లు, శిక్షల తీవ్రత కూడా అంతే ఉంటుందని రేవంత్‌రెడ్డి వంటి మేధావికి తెలియకపోవడమే అమాయకత్వం. కేసులు లేని వారినే సైన్యంలోకి తీసుకుంటారని తెలిసికూడా, యువకులు విధ్వంసకాండకు తెగబడటమంటే అది తెంపరితనమా? అమాయకత్వమా? పట్టాలపై కూర్చుని మీడియాకు సందేశం ఇస్తున్న ఓ యువకుడు, అసలు సైనిక శిక్షణతో సంబంధమే లేని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త అని తర్వాత తేలింది. ఇలాంటి ముసుగువీరులు ఎంతమంది ఉన్నారో? అసలు తమ పుత్రరత్నాలు సికింద్రాబాద్‌కు వెళుతున్న విషయమే తమకు తెలియదని, స్వయంగా తలిదండ్రులే మీడియాకు చెప్పినప్పుడు, వారు అమాయకులు ఎలా అవుతారు? దేశచరిత్రలో రైల్వేస్టేషన్‌లో అంత అనాగరికంగా విధ్వంసం చేసిన ఘటనను ఎంపీ అయిన రేవంత్‌రెడ్డి ఇప్పటివరకూ ఎందుకు ఖండించలేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

warangal-ministersఅయితే.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన రాకేష్‌పై, అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పేటెంటీ సాధించింది. వరంగల్‌లో రాకేష్‌ మృతదేహంపై టీఆర్‌ఎస్‌ జండా కప్పి, ఆయన మృతదేహాన్ని మంత్రులే మోశారు. రాకేష్‌ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఆందోళనకు టీఆర్‌ఎస్‌ నైతిక మద్దతునిచ్చినట్టయింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకించడంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ కంటే, టీఆర్‌ఎస్‌ పార్టీనే రాజకీయంగా అగ్రస్థానంలో నిలిచింది.

ఫలితంగా రేపు సైనిక శిక్షణ పొందిన వారి కుటుంబాలంతా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గే ప్రమాదాన్ని తుంచేయడానికే, రేవంత్‌ పరామర్శ పేరిట రంగప్రవేశం చేసినట్లు కనిపిస్తోంది. అందుకే చంచల్‌గూడ జైలుకు వెళ్లి, ఆందోళనకారులను పరామర్శించారన్నది రాజకీయ పరిశీలకు విశ్లేషణ. ఆందోళనకారులకు న్యాయసహాయం చేస్తామన్న రేవంత్‌రెడ్డి భరోసా వెనుక.. వారిని టీఆర్‌ఎస్‌ ప్రభావం నుంచి తప్పించి, కాంగ్రెస్‌ వైపు మళ్లించడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.

LEAVE A RESPONSE