-బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావు
-గెలిచినోడు రాజు కాదు. ఓడినవాడు బంటు కాదు
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది…ఈ సునామీలో గడ్డపారలే కొట్టుకుపోతాయి.. గడ్డిపోచలు ఎంత? అని టీసీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తల శ్రమనే ఎగ్జిట్ పోల్స్ లో ప్రతిబింబిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ఓటు వేశారని స్పష్టం చేశారు. దొరల తెలంగాణ అంతమై… ప్రజల తెలంగాణ వస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి గెలవలేదు అన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడగొడుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తేలిపోయిందని అన్నారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని దుయ్యబట్టారు. ఓటమి ఎదురైనప్పుడల్లా కేసీఆర్ నియోజకవర్గం మారుస్తారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3నే శ్రీకాంతాచారి తుదిశ్వాస విడిచారు.. అదే రోజున ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని రేవంత్ పేర్కొన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగానికి ఎన్నికల ఫలితాలకు ఓ లింక్ ఉందని చెప్పారు. ప్రాణ త్యాగం చేయడం ద్వారా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడని, శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పిస్తున్నామని రేవంత్ అన్నారు. నేడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు మెజారిటీని కట్టబెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ రబ్బిస్ అని కేటీఆర్ పేర్కొన్న వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. అవి నిజమైతే కేటీఆర్ క్షమాపణలు చెబుతారా? అని రేవంత్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. దేశంలో ఉన్న ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌కు అధికారం రాదు అని చెప్పడం లేదన్నారు రేవంత్ రెడ్డి. జంతువుల కంటే హీనంగా ప్రజల్ని కేసీఆర్ కుటుంబం ట్రీట్ చేసింది కాబట్టే.. ప్రజలకు వారికి బుద్ధి చెప్పారన్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై కేటీఆర్ మాత్రమే మాట్లాడారని… కేసీఆర్ బయటకు రాలేదన్నారు. ఈరోజు 7 గంటల నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు..గ్రామ గ్రామాన సంబరాలు చేసుకోవాలన్నారు. గెలుపు ఓటములు ప్రజా స్వామ్యంలో సహజమన్నారు. గెలిచినోడు రాజు కాదు. ఓడినవాడు బంటు కాదన్నారు. ప్రజారంజకమైన పాలన అందించాలంటే.. ప్రతిపక్షం, పాలకపక్షం బాధ్యాతయుతైమన పాత్ర వహించాలన్నారు రేవంత్. గతంలో కేసీఆర్ గెలిస్తే రాజు.. ఓడితే బానిస తరహాలో శాసనసభను నడిపించారన్నారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని చెప్పారు. తాము పాలకులుగా ఉండబోమని, సేవకులుగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే… ప్రజాస్వామిక విలువల్ని పునరుద్ధరిస్తుందన్నారు. ముఖ్యమైన అంశాలపై పరిపాలన నిర్ణయాలపైన.. సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు కూడా మాట్లాడే విధంగా పారదర్శక పాలన తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా… ఈ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుందన్నారు.
అన్ని జాతులకు, సంఘాలకు. కులాలకు, కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందన్నారు. మీడియా మిత్రులకు కూడా ఇవాళ సాయంత్రం నుంచి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ప్రజల అభిప్రాయల్ని, సమస్యల్ని ప్రతిబింబించే విధంగా అవకాశం వస్తుందన్నారు. మీడియా మిత్రులు కూడా మీ విధానాన్ని సవరించుకోవాలన్నారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరిపై అధిపత్యం చెలాయించదన్నారు. ఎవరిని నిర్భందించడానికో.. ఎవరిని ఇబ్బందులకు గురి చేయడానికో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం లేదన్నారు.
ఈ తెలంగాణ ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా…ఇది ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం… మా ముందున్న లక్ష్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం, ఆరు గ్యారంటీలకు చట్టబద్దత, ప్రజాస్వామిక పాలన…నేను ఏ పదవిలో ఉండాలో.. ఏ పదవికి రాజీనామా చేయాలో పార్టీ నిర్ణయిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే
ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే అని విమర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. వీటన్నింటికి శాశ్వత పరిష్కారం ప్రజామోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడటమే అని చెప్పారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటి వాటాలు, ఆస్తుల పంపకాల విషయంలో కాంగ్రెస్ సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరిస్తుందన్నారు. వివాదాలను సామరస్యంగా సరైన పరిష్కారం చూపించే బాధ్యత కాంగ్రెస్‌ది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్ లోని ZPHS boys south wing పోలింగ్ బూత్ (బూత్ నెం.237) లో రేవంత్ రెడ్డి ఓటేశారు.