అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ
ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నెలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు.
మంగళవారం చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్, బీజేపీ మాజీ జెడ్పీటీసీ రవీందర్, పలువురు మాజీ సర్పంచులు, బీఆరెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్… పేదల సంక్షేమాన్ని మరిచారు అని విమర్శించారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అని ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించని పరిస్థితి వచ్చిందన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన రైతు వ్యతిరేకి కేసీఆర్ సీఎం అయ్యాక 88వేల మంది రైతులు చనిపోయారన్నారు.
దళితులకు భూములు పంచింది, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారు అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకుందన్నారు. హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని, ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతున్నారని విమర్శించారు.
పావలా వడ్డీ, బంగారు తల్లి పథకాలను కేసీఆర్ సర్కారు అటకెక్కించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
ఇలాంటి పాలన పై “తిరగబడదాం – తరిమికొడదాం” : రేవంత్ రెడ్డి
మీర్‌పేట్ బాలిక అత్యాచార ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్… బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్ పేటలో ఆడబిడ్డల పై అఘాయిత్యాల కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని… ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు. ఇలాంటి పాలన పై “తిరగబడదాం – తరిమికొడదాం” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.