– మండిపడ్డ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్
తాడేపల్లి: అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను, రౌడీలను ఉపయోగించి కుట్రలు చేసైనా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవాలని చంద్రబాబు కలలు కంటున్నారని, కానీ ఆయన లక్ష్యం నెరవేరదని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇంకెంత దిగజారి రాజకీయాలు చేసినా పులివెందులలో వైయస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవం అని అన్నారు.
అభివృద్ధికి కేరాఫ్‌గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలు కార్పణ్యాలకు అడ్డాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. తన ఏడాది పాలన మీద నమ్మకం లేకనే రౌడీలను, పోలీసులను ప్రయోగించి అప్రజాస్వామ్య విధానాలతో చంద్రబాబు టీడీపీని గెలిపించాలని ఆశపడుతున్నారని మండిపడ్డారు. దాడులకు, అట్రాసిటీ కేసులకి వైయస్సార్సీపీ బెదిరే ప్రసక్తే లేదని, మా కార్యకర్తలను జైల్లో నిర్బంధించాలంటే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో బీహార్ కన్నా దారుణంగా మార్చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగితే ఓడిపోతామనే భయంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ గెలుపు కోసం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. ఎన్ని కుట్రలు చేసైనా గెలిచి తీరాలనే కాంక్షతో ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రణరంగంగా మార్చేసి స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. టీడీపీ శ్రేణులను రంగంలోకి దింపి వారికి పోలీసులతో రక్షణ కల్పిస్తూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడులు చేయిస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఒక్క కేసు కూడా లేని వందలాది మంది వైయస్సార్సీపీ సానుభూతిపరులు, కార్యకర్తలను బైండోవర్ చేసి అడ్డదారిలో గెలవడం కోసం కుట్రలు చేశారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా..? అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న పులివెందుల ప్రాంతాన్ని కక్షలు కార్పణ్యాలకు అడ్డాగా మార్చే కుట్రకు సీఎం చంద్రబాబు తెరలేపారు.