Suryaa.co.in

Andhra Pradesh

సత్తెనపల్లిలో రైలు బోగీ దహనానికి కుట్ర

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అందుకే దిగిపోయారని గ్రేట్ ఆంధ్ర కథనం
-కిషన్ రెడ్డిని రైలు దిగిపొమ్మన్నది జగన్మోహన్ రెడ్డే
-అది నిజమా? కాదా??  ఒకవేళ తప్పయితే గ్రేట్ ఆంధ్ర పై చర్యలు తీసుకోవాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను రైలులో బయలుదేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రైలు బోగీ దహనానికి కుట్ర పన్నారని, ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొనడం జరిగిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. తనతోపాటు అదే రైలులో ని మరొక బోగీలో ప్రయాణం చేయవలసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రైలు దిగిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లుగా ఆ కథనంలో రాశారని వెల్లడించారు. రైలు సత్తెనపల్లికి చేరుకోగానే బోగీ తగలబెట్టేందుకు కుట్ర చేశారన్నది నిజమని… అందుకే కిషన్ రెడ్డిని ఆ రైలు నుంచి దిగిపొమ్మని జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఒకవేళ గ్రేట్ఆంధ్ర కథనం తప్పయితే, ఆ పత్రిక పై చర్యలు తీసుకోవాలన్నారు. సత్తెనపల్లిలో బోగీ దహనం చేయాలన్నది తమ పార్టీ నేతలది కుట్ర అయితే, అది ఒక స్టోరీ అని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి పేర్కొనడం ద్వారా తనలోని హింస ప్రవృత్తిని మరోసారి చాటుకున్నారని మండిపడ్డారు. విజయ సాయి చేసిన దొంగ పనులన్నీ తాను జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి భారతి రెడ్డికి గతంలోనే చెప్పానని తెలిపారు. భారతి రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి, ఈ ఏ 2 గాడు, ఎలా బ్లాక్ మెయిల్ చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్నాడో తనకంటే బాగా తెలిసిన వారు ఎవరూ లేరన్నారు. ఆర్థిక నేరాల కేసులలో అప్రూవర్ గా మారిపోతానని చెప్పి అటు భారతి రెడ్డిని, ఇటు జగన్మోహన్ రెడ్డిని విజయసాయి బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. ఇష్టం లేకపోయినా, ఏ 2 గాడిని జగన్మోహన్ రెడ్డి మోయాల్సి వస్తుందన్నారు. 2013 లోని విజయసాయి కమిషన్ల కథల గురించి తాను భారతి రెడ్డికి చెప్పినట్లు రఘురామా వెల్లడించారు.

పెగ్గు రెడ్డి పార్టీలో… పెగ్గు రాజు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరిట ఉన్నదో చెప్పాలన్న రఘురామకృష్ణంరాజు, ఆ పెగ్గురెడ్డి పార్టీలో పెగ్గురాజు ఉన్నారని వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి తాను ఎన్నోసార్లు రెండేసి పెగ్గుల మద్యాన్ని సేవించానని, మద్యం సేవించడమేమి నేరం కాదని… హత్యలు చేయడం, కుటుంబ సభ్యులను లేపేయడమే నేరమని విజయసాయి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పెగ్గులను అమ్ముకుని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజలు జగనన్నకు పెట్టిన పేరు జలగన్న ఆయన , తాను ఏంటో ప్రజలకు పూర్తిగా తెలుసునని చెప్పారు. నీ బాబు రక్త చరిత్ర ఏమిటో నిన్ననే బయటపెట్టానని విజయసాయిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ పెద్దనాన్నను మీ బాబు లేపేస్తే, జలగన్న చిన్నాన్న గుండె ఆగి చనిపోయిందని చెప్పావు కదా… మరి ఎనిమిది నెలలు ఏమి విచారణ చేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలో కళ్ల సిద్ధాంతం చెప్పాక, అసలు బండారం ఎక్కడ బయటపడుతుందోనని, సిబిఐ పోలీసులపై కేసులు నమోదు చేసింది ఎవరని నిలదీశారు. ముత్యాల ముగ్గు లో ప్రతి నాయకుడు రావు గోపాలరావు చెప్పినట్లు మీరు ఖర్చు చేసి , చంద్రబాబు అకౌంట్లో జమ చేసినట్లుగా… ఎన్నికల్లో ప్రచారం చేసుకొని గెలిచారన్నారు.

ఆ పోలిక ఎక్కడ?

గిరిజనుల కోసమే అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులతో పోరాటం చేశారని, అల్లూరి స్ఫూర్తితో గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము ను ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. అయితే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఏ ఒక్కరు కూడా, అల్లూరి స్ఫూర్తి తో మోడీ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ, పోల్చి ప్రసంగించకపోవడం విస్మయాన్ని కలిగించిందన్నారు.. తాను సభకు హాజరై ప్రసంగించి ఉంటే తప్పక ఈ అంశాన్ని ప్రస్తావించేవాడిని చెప్పారు.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెప్పారని, ఈ విషయాన్ని తాను గతంలో
పార్లమెంట్లో ప్రస్తావిస్తే.. డిస్ క్వాలిఫై చేయాలని చెప్పినవారికి చెప్పు పుచ్చుకొని కొట్టినట్లు గా ప్రధాని ప్రసంగం ఉన్నదన్నారు. ప్రధాని వ్యాఖ్యల మర్మం అర్థం చేసుకుంటే, ఇంగ్లీష్ మీడియం కంటే, మాతృభాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పకనే చెప్పారన్నారు. రాజ్యాంగానికి భంగం వాటిల్లితే అల్లూరి స్ఫూర్తితో తిరగబడాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పని చేయకపోయినా ఆహా అంటూ కితాబు ఇస్తుంటారని, ప్రధాని అటువంటి వ్యాఖ్యలు ఏవి చేయలేదంటే రాష్ట్రంలో పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో పెద్దాయన చెప్పకనే చెప్పారని, తనతో చాలామంది చెప్పారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ప్రధానమంత్రి తన మనసులోని భావాలను చక్కటి సందేశం రూపంలో నర్మగర్భంగా విజ్ఞులైన ప్రజలకు అర్థమయ్యే రీతిలో, తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రఘురామ వెల్లడించారు

స్టీఫెన్ రవీంద్ర పై కెసిఆర్ కు ఫిర్యాదు చేస్తా

ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు కలిసి అల్లర్లు ఎక్కడ జరుగుతాయో అక్కడ తమ సిబ్బందిని మోహరించినట్లు కట్టు కథలు చెబుతున్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. దానిలో భాగంగానే తన ఇంటి వద్ద ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పహారా కాసినట్లు కట్టు కథలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటలిజెన్స్ పోలీసులు తన ఇంటి చుట్టూ తిరగవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరి తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు భీమవరం సభలో ఘర్షణలు తలెత్తకుండా మహారా కాశారా? అంటూ ప్రశ్నించారు. తన ఇంటి వద్ద దొంగలా తచ్చాడుతున్న వ్యక్తిని సి ఆర్ పి ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అప్పగించారని, ఐడి కార్డ్ ఎక్కడ అని ప్రశ్నించగా తన వద్ద ఐడి కార్డు లేదంటూ మీడియా ముందు ఆ వ్యక్తి వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే సాక్షి దినపత్రికలో మాత్రం ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై రఘురామరాజు కుటుంబం దాడి అంటూ వార్తా కథనం ప్రచురించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తీరు పై మండిపడ్డారు. స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని చెప్పారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో కడపలో పనిచేశారని… ఆయన, జగన్మోహన్ రెడ్డి మనిషని వ్యాఖ్యానించారు. స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రకు తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని కానీ కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారని చెప్పారు.

LEAVE A RESPONSE