Home » అదానీకి విద్యుత్ బిల్లుల వసూలు అప్పగించే కుట్ర

అదానీకి విద్యుత్ బిల్లుల వసూలు అప్పగించే కుట్ర

-విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్
-బిల్లుల వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదు
-విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే కుట్ర
-రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి

హైద‌రాబాద్‌: విద్యుత్ బిల్లుల వసూలును ప్రయివేటు కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయాలు తీసుకోబోతుంది. విద్యుత్ బిల్లుల వసూలును ఆదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లులు వసూలు పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న పాతబస్తీకే పరిమితం కాదు. రాష్ట్రం మొత్తం విద్యుత్ బిల్లుల వసూలు ప్రయివేటు చేతిలోకి వెళ్తుంది.

విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ సబ్సిడీలు,రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో వుండదు. రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్ రంగాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని కేసీఆర్ అంగీకరించలేదు.

కేంద్ర ప్రభుత్వం,మోడీ కనుసన్నల్లో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మోడీ,అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. విద్యుత్ సంస్థ ప్రజల ఆస్తి. దీన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ఓల్డ్ సిటీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయి. అందుకే ప్రయివేటు వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారు.

తెలంగాణలో 95 నుండి 97 శాతం వరకు కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయి. ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయి సింగరేణి బొగ్గు గనులను వేలం వేస్తుంటే, డిప్యూటీ సీఎం భట్టి వేలంలో పాల్గొన్నారు. శ్రావణ పల్లి బొగ్గు గనిని వేలం నుండి ఎందుకు తీసివేయించలేదు? బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు.

సింగరేణి బొగ్గు గనులను లీజుకు తీసుకున్న కంపెనీలను మేము అనుమతించమని బిఆర్ఎస్ ఇప్పటికే అభిప్రాయం చెప్పింది. విద్యుత్ బిల్లుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపాలి. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంగా వ్యవహరిస్తోంది.

విద్యుత్ ఉద్యోగుల పాత్ర నామమాత్రంగా మారే అవకాశం వుంది. ప్రయివేటు వాళ్లకు అప్పగిస్తే విద్యుత్ వ్యవస్థ నాశనం అవుతుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఓల్డ్ సిటీలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడలేదు.

Leave a Reply