- స్వాతంత్రం వచ్చిన 50 ఏళ్ల పాటు జాతీయ జెండా ఎగరవేయని ఆర్ఎస్ఎస్
- గాడ్సే వారసులు అమృత్ వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు
- జాతీయ ముసుగులో దేశాన్ని అమ్ముతున్న బిజెపి
- శ్రీలంక అధ్యక్షుని తరిమినట్టే బిజెపి పాలకులను ప్రజలు తరిమి తరిమి కొడతారు
- మరో జాతీయోద్యమానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- భారీ గజమాలతో భట్టి దంపతులకు సన్మానం
- దారి పొడవునా భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన మహిళలు
- ఖమ్మంలో రెండో రోజు కొనసాగిన ఆజాదీ కా గౌరవ్ యాత్రలో పాల్గొన్న భట్టి విక్రమార్క
జాతీయవాదం ముసుగులో బిజెపి పాలకులు సింగరేణి తో పాటు దేశాన్ని బహుళ జాతి సంస్థలకు అమ్మే కుట్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి ఖమ్మంలో ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి ప్రారంభమై కోదాడ ఎక్స్ రోడ్, వరంగల్ ఎక్స్ రోడ్, పెద్దతండ, నాయుడుపేట, కాల్వడ్డు ఖమ్మం, మయూరి సెంటర్, ఇల్లందు ఎక్స్ రోడ్, వైరా రోడ్, ఇంద్ర నగర్ కాలనీలో కొనసాగింది. ఈ సందర్భంగా వరంగల్ ఎక్స్ రోడ్, పెద్ద తండ, ఖమ్మం రాజీవ్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన 50 సంవత్సరాల వరకు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయని ఆర్ఎస్ఎస్ వారసులైన బిజెపి నాయకులు అమృత్ వారోత్సవాల పేరిట ప్రచార ఆర్భాటం చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని పట్టపగలు చంపిన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన గాడ్సే వారసులు జాతీయవాదం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 1885 సంవత్సరం నుంచి 1947 వరకు స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, పూర్ణ స్వరాజ్, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాల్లో కనిపించని ఆర్ఎస్ఎస్ వాదులు తామే పెద్ద దేశభక్తులమని గొప్పగా ప్రచారం చేసుకుంటూ దొంగ భక్తిని చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోతున్నదన్నారు. ప్రజలపై పన్నుల భారం, దేశానికి అప్పుల భారం మోపి నిరుద్యోగ భారత్ గా మార్చిన మోడీ పరిపాలనతో దేశం మరో శ్రీలంక మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక పాలకులను తరిమినట్టుగానే అతి త్వరలో బిజెపి పాలకులను దేశం నుంచి ప్రజలు తరిమి తరిమి కొడతారని పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి రానప్పుడు 2014 సంవత్సరానికి ముందు అంబానీ, ఆదానిలకు ఉన్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ప్రపంచంలో వారు అత్యంత కుబేరులుగా మారడానికి ఎవరు కారకులని మోడీని నిలదీశారు. రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా ను అమ్మకానికి పెట్టిన మోడీ 5G సేవలను తన స్నేహితుడైన అంబానికి ధారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పోగుచేసిన దేశ సంపదను అంబానీ ఆదానిలకు మోడీ సర్కార్ దారదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. దేశ ఆస్తులు, వనరులు, అడవులను ప్రైవేటుపరం పేరిట కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోడీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి, ఆర్ఎస్ఎస్, మోడీ సర్కార్ దేశాన్ని నాశనం చేయడానికి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరో జాతీయోద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతున్నదని వెల్లడించారు. జాతిని ఐక్య చేసి విచ్ఛిన్నకర శక్తులను దేశం నుంచి పారద్రోలుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ లో భిన్న అభిప్రాయాలు మాత్రమే..
కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని, కేవలం భిన్నభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. భిన్నభిప్రాయాలను గౌరవించడమే ప్రజాస్వామ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని మిగత పార్టీలో ఉండదని చెప్పారు. కాంగ్రెస్ అంటే గిట్టని వారు కొంతమంది పనిగట్టుకొని భిన్నాభిప్రాయాలను అభిప్రాయ బేధాలుగా మార్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు కాంగ్రెస్ కు కంచుకోట అని 1967లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాడని గుర్తు చేశారు. రాష్ట్రంలో బిజెపికి బలం ఏముందని మునుగోడులో గెలుస్తుందని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, టిఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయమని ఈ ఎన్నికలు రుజువు చేస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం పట్టణ అధ్యక్షులు జావిద్, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు సౌజన్య, శేఖర్, వీరభద్రం, సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క దంపతులకు గజమాలతో సత్కారం
75వ స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారికి ఖమ్మం పట్టణంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో సన్మానం చేశారు. క్రేన్ సహాయంతో భట్టి దంపతుల మెడలో గజమాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేశారు.
దారి పొడవున బ్రహ్మరథం
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమై ఖమ్మం పట్టణానికి వస్తుండగా మార్గమధ్యలోని సూర్యాపేట రోడ్డు వద్ద మహిళలు కిలోమీటర్ మేర వరుస క్రమంలో నిలబడి ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న విక్రమార్క గారికి ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత మహిళలు పాదయాత్రలో పాల్గొన్నారు. డప్పుల దరువులు, మహిళల కోలాట నృత్యాలు, బంజారా బేరి నృత్యం, కళాకారుల కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.