Suryaa.co.in

Andhra Pradesh

పల్లెల్లో నిరంతర అభివృద్ధి పండుగ

• ఉగాది కానుకగా గ్రామీణ అనుసంధాన రహదారుల నిర్మాణం
• నాబార్డు నిధులు రూ.557.22 కోట్లతో, 1202.66 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం
• నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

అమరావతి: పల్లెల్లో అభివృద్ధి పండుగ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘పల్లె పండుగ’’ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనుల జాతర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పండుగను నిరంతరం గ్రామాల్లో కొనసాగించేలా… తెలుగు నూతన సంవత్సరాది అయిన ఉగాది పండుగ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పల్లెవాసులకి తీపి కబురు చెబుతున్నారు.

నాబార్డు నిధులు రూ. 557.22 కోట్లతో, మొత్తం 402 రహదారి పనులు చేసేందుకు నిర్ణయించారు. గ్రామాలు, మండలాల అనుసంధాన రోడ్లు ఈ నిధులతో పూర్తి కానున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 1202.66 కిలోమీటర్ల మేర గ్రామీణ అనుసంధాన రోడ్లను పునర్ నిర్మించబోతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టే ఈ పనులు పూర్తి నాణ్యతతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనీ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

పల్లెల్లో అభివృద్ధి పనుల పండుగ నిరంతరం కొనసాగేలా, గ్రామాల రూపురేఖలు మార్చేలా పనులు కొనసాగాలని స్పష్టం చేశారు. నాబార్డు నిధులు మంజూరుకి తోడ్పాటునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE