అమిత్ షాను కోరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: అనంతపురం కేంద్రంగా పనిచేస్తోన్న రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు ఎఫ్.సి. ఆర్. ఎ పునరుద్ధరణ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కోరారు. సుమారు ఐదున్నర దశాబ్దాల కాలంగా పేదలకు సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు విదేశీ విరాళాల సేకరణకు సత్వరం అనుమతులు మంజూరు చేయాల్సిoదిగా విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం పార్లమెంట్ భవనంలో హోమ్ మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సారథ్యంలో పలువురు టిడిపి ఎంపీలు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు అమిత్ షాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లా కేంద్రంగా దశాబ్ధాల కాలంగా ఆర్డీటీ ప్రజలకు సేవలందిస్తున్న విషయాన్ని వారు హోంమంత్రికి వివరించారు. కులాలకు, మతాలకు అతీతంగా పేదరికమే ప్రామాణికంగా ఆర్డీటీ సేవలందిస్తున్న విషయాన్ని టీడీపీ ప్రజా ప్రతినిధులు గుర్తు చేశారు. 2021 నుంచి ఆర్డీటీ కి విదేశీ విరాళాల సేకరణ కార్యక్రమానికి విఘాతం కలిగిన విషయాన్ని వారు ఆయనకు తెలిపారు. అందుబాటులో ఉన్న ఆర్డీటీ విదేశీ విరాళాల వినియోగంపై కూడా ఆంక్షలు విధించడం ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించుటకు అవరోధంగా మారిందన్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచన మేరకు ఎఫ్ సి ఆర్ ఎ పునరుద్ధరణకు ఆర్డీటీ మూణ్ణెల్ల కిందట తాజా దరఖాస్తును సమర్పించిoదన్నారు. ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తును పారిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని వారు అమిత్ షాను కోరారు. అనంతపురం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఆర్డీటీ విశేష సేవలందిస్తోందని వారు పేర్కొన్నారు. అలాంటి సంస్థ కార్యకలాపాలు మరింత విస్తృతం కాగలిగితే పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
రాజకీయాల మరకలంటని ఆర్డీటీ లాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధుల బృందం విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీస్తామని వారంలోపు తగిన నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా వారికి హామీ ఇచ్చారు.
కేంద్ర హోంమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు లావు శ్రీ కృష్ణ దేవరాయులు, సాన సతీష్ బాబు, బికె పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీతమ్మ, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుబాటి ప్రసాద్, ఎమ్.ఎస్. రాజు, ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులున్నారు.