Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతి టిడిఆర్ బాండ్ల అవినీతి లెక్కలు తేల్చాలి

-మాస్టర్ ప్లాన్ రోడ్ల మాయాజాలం నిగ్గు తేల్చాలి
-బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి

తిరుపతి: తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి ఎన్డీఏ కూటమిపై రాష్ట్ర ప్రజలలో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని బీజేపీ నేత నవీన్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

తిరుపతి నగరపాలక సంస్థలో గతంలో పనిచేసి టిడిఆర్ బాండ్ల దందాకు సహకరించిన కమీషనర్లను,టౌన్ ప్లానింగ్ కీలక అధికారి,సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులను వెంటనే సస్పెండ్ చే సి, కార్పొరేటర్లను కష్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుపతి మాజీ ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తూ కార్పొరేటర్ గా అవతారం ఎత్తి నగరపాలక సంస్థలోనే కాకుండా తిరుపతి నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖలలో రాజ్యాంగేతర శక్తిగా మారి, టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ తో సహా.. నగరపాలక సంస్థ మాజీ కమిషనర్లు, మరో ఐదు మంది కార్పొరేటర్లు పార్టీ కీలక వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అధికారుల ద్వారా అదుపులోకి తీసుకొని విచారిస్తే టిడిఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ దోపిడీ వెలుగులోకి వస్తుందన్నారు.

రామస్వామి వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే గారి పీఏ, కార్పొరేటర్ కాక ముందు ఉన్న ఆస్తులు ఎన్ని? ఈ 5 సంవత్సరాలలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్ని? అన్నదానిపై సమగ్ర విచారణ జరపాలని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.

నగరాభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చినవారికి, అధికార బలంతో నిర్బంధంగా భూములు లాక్కున్న వారికి రావలసిన టిడిఆర్ బాండ్లను సకాలంలో ఇవ్వకుండా “బ్లాక్ మెయిల్” చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో కుమ్ముక్కై వ్యవసాయ భూములను కమర్షియల్ భూములుగా మార్చి భూములు ఇచ్చిన వారిని ఏమార్చి, బెదిరించి దండుకున్న సొమ్మును వెంటనే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి భూ బాధితులకు టిడిఆర్ బాండ్లు ఇచ్చి న్యాయం చేయాలన్నారు.

తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టిడిఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాస్టర్ మైండ్ అధికారులను,ప్రతిపక్ష కార్పొరేటర్లను జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకొని రికవరీ చేయాలన్నారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో టి డి ఆర్ బాండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగింది. అందులో తిరుపతి నగరపాలక సంస్థ “టాప్ టు” లో ఉందన్నారు. గత ప్రభుత్వంలో పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను అభిమానులను పక్కనపెట్టి, మాజీ ఎమ్మెల్యే పీఏ గా అధికారాన్నంతా తన గుప్పెట్లో పెట్టుకొని ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కార్పొరేటర్ రామస్వామి వెంకటేష్ “బ్యాంకు ఖాతాలను సీజ్”చేసి, అక్రమ ఆస్తుల చిట్టాను ప్రభుత్వ నిఘా సంస్థల ద్వారా సేకరించి స్వాధీనం చేసుకోవాలన్నారు.

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే పిఏ గా, కార్పొరేటర్ గా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తులపై,భూ దందాలపై,సెటిల్మెంట్ లపై రామస్వామి వెంకటేష్ కార్పొరేటర్ చేసిన అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం తిరుపతిలో టోల్ ఫ్రీ నెంబర్ పెడితే బాధితులంతా క్యూ కడతారన్నారు.

తిరుపతి నగరపాలక సంస్థ టి డి ఆర్ బాండ్ల కుంభకోణాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన పత్రాలను , ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నానని అక్రమార్కులకు సహకరించిన అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్నారు.

LEAVE A RESPONSE