Suryaa.co.in

Editorial

జగన్ కు కోటరీ ఝలక్

  • కోటరీ ఉచ్చులో జగన్

  • వైసీపీలో ఆ ముగ్గురు చెప్పిందే వేదం

  • చక్రం తిప్పుతున్న కోటరీ

  • సజ్జల, అప్పిరెడ్డి, రఘురామ్‌దేహవా

  • కోటరీ దెబ్బకు పార్టీ నుంచి బయటకు వెళ్లిన బాలినేని, మోపిదేవి

  • విజయసాయిరెడ్డినీ పక్కనపెట్టించిన సజ్జల?

  • ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితమైన విజయసాయిరెడ్డి

  • జగన్ చెప్పినా దక్కని అధ్యక్ష పదవులు

  • జగన్ ఆదేశాలు బేఖాతర్

  • జిల్లా అధ్యక్షుల్లో కోటరీదే పైచేయి

  • కోటరీని మెప్పించిన వారికే పదవులు

  • కోటరీపై నేతల కన్నెర్ర

  • సజ్జలపై సీనియర్ల సలసల

  • పార్టీని పుట్టిముంచుతున్నారంటూ రుసరుస

  • కౌన్సిలర్లుగా కూడా గెలవలేని వాళ్లు మాపై పెత్తనం చేస్తున్నారంటూ ఆగ్రహం

( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీలో ఆ పార్టీ అధినేత జగన్ చెప్పిందే వేదం అనుకుంటారు. ఆయన మాట శిలాశాసనం అని భావిస్తారు. జగనన్న చెబితే అయిపోతుందనుకుంటారు. కానీ అదంతా ఉత్తిదే. ఇప్పుడు పార్టీలో ఆ ముగ్గురూ ఎంత చెబితే అంత! వారు చెప్పిందే వేదం. చేసిందే శాసనం!! మరి జగన్ ఏం చేస్తున్నారు? విజయవాడ టు బెంగళూరు; బెంగళూరు టు విజయవాడ షటిల్ సర్వీసులు చేస్తుంటారు. మధ్యలో ఏదైనా చావులొస్తే వెళ్లి ‘ఓదార్పు’యాత్రలు చేస్తుంటారు. ఆ ముగ్గురు చెప్పింది చేస్తుంటారు. ఎవరూ తనను పార్టీ ఖర్చులకు డబ్బులు అడక్కపోతే చాలు. ఇప్పుడు వైసీపీలో జగన్ పాత్ర అంతే!

జగన్ ఒక నాయకుడిని పిలిచి ‘నువ్వే ఫలానా జిల్లా అధ్యక్షుడివి. అందరినీ సమన్వయం చేసుకుని పనిచేసుకో’మని చెప్పడమే కాకుండా, పీఏని పిలిచి ఈ అన్న పేరు సాయంత్రానికి అనౌన్స్ చేయమని ఆదేశించారనుకోండి. అది గంటల్లో జరిగిపోతుందని కదా అందరి భావన?!

బట్ ఇప్పుడు పార్టీలో సీను మారింది. జగన్ చెప్పినా జాన్తానై అంటున్నారు ఆ ముగ్గురు నాయకులు! జగనన్న చెప్పిన పేరుకు భిన్నంగా, మరొకరిపేరు పత్రికల్లో వస్తున్న వైచిత్రి. ఏంటీ.. నమ్మడం లేదా? అంతలావు జగనన్న ఏంటీ.. ఆఫ్టరాల్ ఆ ముగ్గురి మాటలు వినడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? బహుబలి జగన్ కోటరీ ఉచ్చులో చిక్కుకోవడతమేమిటని హాశ్చర్యపోతున్నారా?

అవును. ఐదేళ్లు తన కత్తికి ఎదురులేకుండా పార్టీ-ప్రభుత్వాన్ని శాసించి-శ్వాసించిన జగన్, ఇప్పుడు వైసీపీలో కోటరీకి బందీయేనట. ఆయన చెప్పిందేమీ చె ల్లుబాటు కావడం లేదట. అందుకు బాపట్ల జిల్లా అధ్యక్ష పదవే ఉదాహరణ అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న చర్చ జగన్ సమక్షంలో జరిగింది. ఆ భేటీకి జిల్లానేతలంతా హాజరయ్యారు.

ఆ సందర్భంగా.. బాపట్ల జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు ఉన్నందున, అగ్రకులానికి చెందిన వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని, వేమూరు అభ్యర్ది అశోక్‌బాబు పార్టీ అధినేత జగన్‌కు సూచించారట. ఆ ప్రతిపాదన నచ్చిన జగన్, మరుసటి రోజు మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం-ఆయన తనయుడు వెంకటేష్, గాదె మధుసూదన్‌రెడ్డిని మాత్రమే పిలిపించారు.

ముందు కరణం బలరామ్‌ను జిల్లా అధ్యక్ష పదవి తీసుకోమని ప్రతిపాదించగా, తనకు ఆసక్తిలేదన్నారు. వెంకటేష్‌ను తీసుకోమని ప్రతిపాదించగా.. తన కాలు ఇంకా నయం కాలేదని, అధ్యక్ష పదవి ఇస్తే తిరిగాల్సి ఉన్నందున తాను ఆ పదవికి న్యాయం చేయలేనని స్పష్టం చేశారు. అయితే ఎవరికి ఇచ్చినా సహకరిస్తానని హామీ ఇచ్చారట.

దానితో మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు గాదె మధుసూదన్‌రెడ్డిని.. ‘నువ్వే అధ్యక్షపదవి తీసుకో. అందరినీ సమన్వయం చేసుకో. నేను నీకున్నా’నని చెప్పి.. పీఏ కేఎన్‌ఆర్‌ను పిలిచి, సాయంత్రం మధుసూదన్‌రెడ్డి పేరు ప్రకటించమని ఆదేశించారు. బయటకు వచ్చిన మధుఎసూదన్‌రెడ్డికి ఫోన్ చేసిన కేఎన్‌ఆర్, అన్నా మీ ఇంటిపేరు ఏంటని అడగడం.. ‘అదేంటి నాన్న గాదె వెంకటరెడ్డి మంత్రి కూడా చేశారు కదా? అని ప్రశ్నించడం జరిగిపోయిందట. అయితే అధ్యక్షుడిగా ఈరోజు ప్రకటించడం కుదరదని, రేపు ప్రెస్‌కు పంపిస్తామని కెఎన్‌ఆర్ ఆయనకు చెప్పారట.

అయితే మరుసటిరోజు సీను మారిపోయింది. స్వయంగా బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రకటి ంచిన గాదె మధుసూదన్‌రెడ్డి బదులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడంతో, పాపం గాదె బిత్తరపోయారట. తాజాగా ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ప్రకటించారు. జగన్ నిర్ణయం మారేందుకు దీనివెనుక కోటరీ కీలకపాత్ర పోషించిందని బాపట్ల నేతలు విరుచుకుపడుతున్నారు.

సామాజికవర్గ సమీకరణలో భాగంగా ఓసీలకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న కోణంలో.. స్వయంగా జగన్ ఎంపిక చేసిన గాదెను కాదని, మేరుగు నాగార్జున పేరు ప్రకటించడానికి సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే సజ్జల ఈ నిర్ణయం తీసుకున్నారని.. జిల్లాలో రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం ఎస్సీలకు రిజర్వు అయిన నేపథ్యంలో.. అధ్యక్ష పదవి కూడా వారికే కేటాయిస్తే, ఇక అగ్రకులాలు పార్టీకి ఎలా పనిచేస్తారని నిలదీస్తున్నారు. ఈ మాత్రం కులం లెక్కలు కూడా తెలియని వారు జగన్ పక్కన ఉండటం తమ దురదృష్టమంటున్నారు.

పార్టీ ఓడినా జగన్ పాఠాలు నేర్చుకోలేదనడానికి, ఇదో నిదర్శనమని వైసీపీ సీనియర్లు విమర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ కోటరీగా ఏర్పడి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విరుచుకుపడుతున్నారు. కౌన్సిలర్లుగా కూడా గెలవని వీరంతా మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారి రాజకీయ భవిష్యత్తు నిర్ణయించటం ఏమిటని మండిపడుతున్నారు.

పార్టీలో తమకు నచ్చని నాయకులను.. వ్యూహాత్మకంగా బయటకు పంపిస్తున్న కోటరీ నేతల రాజకీయాలకు, అగ్రనేతలు సైతం పార్టీని వీడుతున్నారని చెబుతున్నారు. తమకు ఇష్టం లేని నేతలపై ఆ జిల్లాకు చెందిన నాయకులతో, ఈ కోటరీనే జగన్‌కు తరచూ ఫిర్యాదులు చేస్తుంటుంది. వారిపై అనుమానం వచ్చేలా వ్యవహరిస్తుంది. ఇందులో ఈ కోటరీ సక్సెస్ అయిందని విశ్లేషిస్తున్నారు.

మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వంటి అగ్రనేతలు బయటకు వెళ్లేందుకు, ఈ కోటరీనే కీలకపాత్ర పోషించిందని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మోపిదేవికి టికెట్ రాకపోవడానికి ఈ కోటరీనే కాఱయమంటున్నారు. ఎంపి విజయసాయిరెడ్డి ప్రకాశం జిల్లా ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఆయన బాలినేనికి దగ్గరయ్యారన్న అనుమానంతో, బాలినేనికి చెక్ పెట్టిందని చెబుతున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తిరుగులేని పట్టున్న బాలినేనిని బలహీనం చేసేందుకు… వైవి సుబ్బారెడ్డితో కలసి ఈ కోటరీ ఆడిన రాజకీయాలను చివరివరకూ ప్రతిఘటించిన బాలినేని, చివరకు పార్టీ నుంచి నిష్ర్కమించి, జనసేనలో చేరాల్సివచ్చిందంటున్నారు. పెదకూరపాడుకు చెందిన హనిమిరెడ్డిని.. అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జిగా తెచ్చింది వీరేనంటున్నారు.

గత ఎన్నికల్లో బాలినేని సూచించిన వారికి కాకుండా, మరొకరికి సీట్లు ఇప్పించటంలోనూ ఇదే కోటరీ చక్రం తిప్పిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీలోనే ఉన్న బాలినేని వర్గీయుడైన ఓ ఎమ్మెల్యేపె..ై జగన్‌కు ఫిర్యాదులు చేయడం ద్వారా, ఆయన కూడా తనంతట తాను బయటకు వెళ్లే రాజకీయాలకు తెరలేపిందని, కోటరీ తీరుపై సీనియర్లు విరుచుకుపడుతున్నారు.

ఒకప్పుడు పార్టీలో నెంబర్‌టూగా ఉంటూ.. జగన్ ఉన్నతి కోసమే రాత్రింబవళ్లు పనిచేసి.. చివరకు ఆయన కోసమే జైలుకు వెళ్లిన ఎంపి విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గించడానికి, ఈ కోటరీ రాజకీయాలే కారణమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ కోటరీ రాజకీయాలకు విసుగుచెందిన విజయసాయి.. ఇప్పడు విజయవాడకు దూరమై, ఢిల్లీ-హైదరాబాద్‌కే పరిమితం కావాల్సి వచ్చిందంటున్నారు.

ప్రధానంగా సజ్జల రాజకీయాలతోనే, కార్యకర్తల కష్టసుఖాలు తె లిసిన విజయసాయి.. పార్టీలో అంటీముట్టనట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన నాయకులను కలవ కపోయినా, విజయసాయిరెడ్డి వద్దకు వెళ్లి పనులు చేసుకునేవారని గుర్తు చేస్తున్నారు.

అసలు అప్పుడు విజయసాయిరెడ్డి లేకపోతే చాలామంది వెళ్లిపోయేవారని, అందరికీ తలలో నాలుకలా ఉంటూ, ఏ స్థాయిలో కూడా జగన్‌పై అసంతృప్తిరాకుండా చూసుకునేందుకు విజయసాయి ఎంత తిప్పలు పడ్డారో, ఎన్ని అవమానాలు గురయ్యారో తమకు తెలుసని ఓ మాజీ మంత్రి చెప్పారు. ఇప్పడు అలాంటి అంకితభావం గల విజయసాయిరెడ్డిని కూడా, దూరం పెట్టే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘మా పార్టీకి 11 సీట్లే వచ్చినా జనంలో జగన్‌సార్‌పై జనంలో అభిమానం చెక్కుచెదరలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా వేలల్లో వస్తున్నారు. ఇంత కష్ట సమయంలో కూడా నియోజకవర్గ ఇన్చార్జి పదవులకు విపరీతమైన పోటీ ఉందంటే.. గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతుంతో అర్థం చేసుకోండి. నేను డబ్బులివ్వనని జగన్‌గారు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా, జిల్లా అధ్యక్ష పదవుల కోసం పోటీ ఉందంటే మళ్లీ మేమే అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉన్నట్లే కదా? మరి అలాంటి సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోకుండా, కోటరీ చేతులో బందీ అయితే ఆయనతోపాటు మేమూ నష్టపోతాము కదా? అయినా ఇంత జరిగినా సజ్జలను తప్పించలేదంటే జగన్‌గారు, ఎంత గుడ్డిగా ఆలోచిస్తున్నారో అర్ధమవుతోంద’ని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర కమిటీ పదవులు సైతం కోటరీని మెప్పించిన వారికే ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ఆమోదం లేకుండానే పదవులిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ కూడా పూర్తిగా కోటరీ చేతిలో బందీ అయ్యారని, విజయవాడ-బెంగళూరు పర్యటనలకే పరిమితమయ్యారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

‘జగన్‌కు ఇష్టమైన పనులేమిటో తెలిసిన ఈ కోటరీ ఆయనను మబ్బుల్లో పెడుతోంది. ఆయన కూడా ఇవన్నీ పట్టించుకోవడం. తనను డబ్బులు అడగకపోతే చాలనుకుంటున్నారు. కోటరీ కూడా అందుకు తగినట్లే పనిచేస్తుండటంతో ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు. అపాయింట్‌మెంట్ సిస్టమ్ కూడా ఏమీ మారలేదు. కోటరీ సూచించిన వారికే అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనను ఇంకా సీఎంగా ఉన్నట్లుగా కోటరీ భ్రమల్లో పెడుతోంది. అధికారంలో ఉన్నప్పుడంటే నడిచిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాయకులను కలవకపోతే ఆయనకు గ్రౌండు రియాలిటీ ఎలా తెలుస్తుంది’ అని కడప జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ప్రశ్నించారు.

LEAVE A RESPONSE