– విశాఖ మిత్రా కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లో దాదాపు 2లక్షల కేజీల గోమాంసం
– టీడీపీ నేత సుబ్రమణ్య గుప్తా ఆధ్వర్యంలో ఎగుమతి
– గోవధపై కనీసం స్పందించని భాజపా నేతలు పురందేశ్వరి, మాధవ్
– సనాతని పవన్ కళ్యాణ్ సైతం మౌనం
– మీరైనా నోరు విప్పండి పవన్ కళ్యాణ్?
– ఇంత అపచారం జరుగుతున్నా పట్టించుకోరా?
– వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చడానికే తిరుమల లడ్డూ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని ఆధారాలు లేకపోయినా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు… విశాఖలో బట్టబయలైన గోవధపై ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు.
టీడీపీ నేతకు చెందిన గోదాములో సుమారు 2 లక్షల కేజీల గోమాంసం పట్టుబడితే… చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు పురంధేశ్వరి, మాధవ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వీటి నుంచి డైవర్షన్ కోసమే కల్తీ నెయ్యి పేరుతో వైయస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. విశాఖపట్నం కేంద్రంలో సుమారు 200 టన్నుల అంటే దాదాపు 2 లక్షల కేజీల గోమాంసం బయపడింది. వధించిన గోమాంసాన్ని విశాఖపట్నం నగరానికి ఆనుకుని శొంఠ్యాంలోని మిత్ర కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ లో నిల్వ ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. భారీ కంటెయినర్ల ద్వారా విచ్చలవిడిగా అమ్మకాలు, ఎగుమతులు సాగిస్తుండగా పట్టుబడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డీఆర్ ఐ) ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. పట్టుబడిన మాంసాన్ని పరీక్షించి అది గోమాంసమే అని నిర్ధారించిన తర్వాత తప్పనిసరి పరిస్ధితుల్లో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 3 వ తేదీన ఇంత పెద్ద ఎత్తున లక్షల కేజీల గో మాంసం పట్టుబడితే ఆ మాంసాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తుంటే… దానిమీద మాత్రం చంద్రబాబు పల్లెత్తు మాట కూడా మాట్లాడ్డం లేదు.
ఈ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ యజమాని అధికారి పార్టీకి చెందిన బాపట్ల ఎమ్మెల్యే వర్మకి అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి హిందువులకు అతి పవిత్రమైన గోమాతను వధించి… టన్నుల, టన్నుల మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించుకుంటే మాత్రం చంద్రబాబు పల్లెత్తు మాట అనరు. రాష్ట్రంలో హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా… అతి పవిత్రమైన గోమాంసాన్ని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? మొన్న మాత్రమే పట్టుకున్నారు. దానిమీద పూర్తిస్ధాయిలో విచారణ చేయాల్సిన బాధ్యత ఉంది. డీఆర్ ఐ వాళ్లు అడిగినా స్పందించడం లేదు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ యజమానిని, సుబ్రమణ్య గుప్తాను అరెస్టు చేయకుండా వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
గోవధ పై నోరు విప్పని బీజేపీ నేతలు
ఆశ్యర్యకరంగా చంద్రబాబుతో పాటు హిందూమతం గురించి గొప్పగా చెప్పే భారతీయ జనతాపార్టీ నేతలు పురంధేశ్వరి, సుజనా చౌదరితో సహా ఎవరూ దీని గురించి మాట్లాడ్డం లేదు. సాక్షాత్తూ విశాఖలో ఉంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సైతం…విశాఖలో జరిగిన ఈ దారుణం గురించి మాట్లాడ్డం లేదు. పైగా వాళ్లను రక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గం.
మరోవైపు చారిటిబుల్ ట్రస్టు పేరిట పశువులను రవాణా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు, హోంమంత్రికి చెందిన వ్యక్తులు కూడా గోవులను రవాణా చేసి వధకు పంపిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇది చాలా అపచారం. జనసేన పార్టీ అధ్యక్షుడు సనాతని పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడ్డం లేదు. చంద్రబాబు చెప్పగానే వైయస్సార్సీపీపై మాత్రం మాట్లాడే పవన్ కళ్యాణ్… దక్షిణ భారతదేశంలో సనాతనాన్ని ప్రచారం చేస్తానని చెబుతాడు కానీ.. రాష్ట్రంలో జరుగుతున్న గోవధ గురించి, తెలుగుదేశం పార్టీ నేతలు పరిశ్రమలా గోవులను వధించి ఎగుమతి చేస్తుంటే.. మాత్రం కనీసం ఖండించలేదు. మీరైనా నోరు విప్పండి పవన్ కళ్యాణ్? టీటీడీ చైర్మన్ గా ఉన్న టీవీ 5 చైర్మన్ బీ ఆర్ నాయుడు తన ఛానెల్ లో కూడా అత్యంత దుర్మార్గంగా అప్రూవర్ గా మారిన టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ స్ధానంలో ఉండి కూడా.. ఇలాంటి వార్తలు రాయడానికి ఏం పోయేకాలం వచ్చింది?