Suryaa.co.in

Andhra Pradesh

“సృజనా”త్మకమైన ఆలోచనలు

– రాజశేఖర్ అదేశాలతో విజయవంతమైన దసరా ఉత్సవాలు
– అధికారుల సమన్వయం – ఫ్రెడ్లీ పోలీసింగ్
– కె.ఎస్. రామరావు నిరంతర పర్యవేక్షణ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న కనకదుర్గమ్మకు ప్రతి ఏటా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది విజయవంతగా ముగిశాయి. శాస్త్రోక్తం గా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమం వైభవం జరిగింది . ఉత్సవాలలో అమ్మవారి దర్శనం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించింది.

గతంలో లోపించిన సమన్వయం…ఈ ఉత్సవాలలో కనిపించలేదు. శాఖల మధ్య సమన్వయమే ఈ ఉత్సవాల విజయవంతానికి ప్రధాన కారణమని చెప్పక తప్పదు .భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం కృతకృత్యులయ్యారు. గత దశాబ్ద కాలంగా ప్రతి ఏడాది ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తి, భక్తులకు కలిగిన అసౌకర్యాలను అధిగమించేందుకు ఈ ఏడాది దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన వినూత్న ఆలోచనలతో పోలీస్ కమిషనర్ ఆదేశాలను అధికారులు సమన్వయంతో అమలు చేసి ఉత్సవాలలో సేవలందించారు.

వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో విధులు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ నిరంతరం ఆయా శాఖల అధిపతులతో ప్రతి అంశంలోనూ ప్రత్యక్ష పర్యవేక్షణ చేయడం ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం.

ముఖ్యంగా భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు అంచనా వేసి జగన్మాతను దర్శించుకునేందుకు ఎంత సమయం పడుతుంది, క్యూ లైన్ లో ఎంతసేపు ఉంటారో… అనే ఖచ్చితమైన అంచనాతో అందుకు తగినట్లు వారికి గతంలో కంటే మిన్నగా వాటర్ బాటిల్స్, వేడి పాలు, మజ్జిగ వంటి ద్రవపదార్థాల పంపిణీ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో సఫలీకృతమయ్యారు.

\స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అందించిన సేవా కార్యక్రమాలు సైతం ఒక క్రమ పద్ధతిలో అందించేందుకు సమయానుకూలంగా ఆయా స్వచ్ఛంద సేవకులకు సరైన సమయంలో అవసరమైన ఆదేశాలు అందించడంతో జగన్మాతను దర్శించుకునేందుకు వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరమైన దర్శన భాగ్యం పొందేలా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.

ఇదే క్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఒక నిర్దేశిత సమయం కేటాయించి, వారి వారి దర్శన వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రోటోకాల్ విభాగం జాగరూకతతో వ్యవహరించి సామాన్య భక్తులకు సత్వర దర్శనం లభించేలా ఒక ప్రత్యేకమైన కార్యాచరణను అమలు చేయడం కూడా ఈ ఉత్సవాలలో ఒక వినూత్నమైన చర్య.

గతంలో వాహనాలతో నిండిపోయిన ఘాట్ రోడ్డు మొత్తం ఈసారి మాత్రం అనుమతి ఉన్న వాహనాల రాకపోకలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ చేపట్టిన చర్యల వల్ల ప్రముఖుల దర్శనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సత్వరమే దర్శనం చేసుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల కారణంగా నగరంలోని పౌరులకు సాధారణంగా కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు చేపట్టిన చర్యలు కూడా ఉత్సవాల విజయవంతానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి.

ముఖ్యంగా ప్రతి ఏటా పోలీసు శాఖలోని కొందరు అధికారులు యూనిఫాం దుస్తులతో దర్శనాల పేరిట చూపిన అత్యుత్సాహం ఈసారి కనిపించదని ఉత్సవాల నిర్వహణకు ముందే ఏర్పాటుచేసిన వివిధ శాఖల సమన్వయ సమావేశంలో ఇచ్చిన మాట ప్రకారం కట్టడి చేశారు.

ఉత్సవాల ముగింపు రోజైన శనివారం భవానీ మాలధారుల రాక పెరగడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జై భవాని నామస్మరణలతో ఇంద్రకీలాద్రి పర్వతం ఎరుపెక్కింది. వేలాదిగా తరలివచ్చిన భవానీలను నియంత్రించేందుకు పోలీసు శాఖ ఎంతో కష్టపడి సేవలు అందించడంతో… అతి తక్కువ సమయంలో దర్శన సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండేలా నియంత్రించారు.

సాధారణ భక్తుల ఇబ్బందులను అధిగమించేందుకు, లోటుపాట్లను చక్కదిద్దేందుకు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ లు కంట్రోల్ రూం నుండి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో దుర్గమ్మను దర్శించుకున్న ప్రతి భక్తుడు ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతితో తన్మయత్వం చెందారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నగరంలోని అనేక ప్రాంతాలలో ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేయడం ఈ ఉత్సవాలలో హైలెట్.

ఈ ఉత్సవాల నిర్వహణలో సేవలందించేందుకు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు ఆహారం, వసతి వంటి అంశాలలో సైతం ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంతటి భారీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసేందుకు సేవలందించిన ప్రతి విభాగం చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించడం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి ప్రధాన భూమిక పోషించింది.

జిల్లా కలెక్టర్ గా బాధ్యతను స్వీకరించిన కొద్ది రోజుల్లోనే డాక్టర్ జి. సృజన తన పనితీరును జిల్లా ప్రజలకు తెలియజేసేందుకు ఇది ఒక మంచి అవకాశం గా భావించవచ్చు. దుర్గమ్మను దర్శించుకున్న ప్రతి భక్తుడు ఒక అలౌకిక ఆనందంతో, సంతృప్తికరంగా దర్శనం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం సంపూర్ణంగా విజయవంతమైంది.

LEAVE A RESPONSE